Makar Sankranti: సాధారణంగా పండగలన్నీ తిథిని బట్టే వస్తాయి. కానీ తిథితో సంబంధం లేకుండా సౌరమానం ప్రకారం వచ్చేది సంక్రాంతి. మన పండగల్లో ఆధ్యాత్మికం, కుటుంబం, సామాజికం.. ఇలా మూడు అంశాలు ఇమిడి ఉంటాయి. సంక్రాంతికి కుటుంబ ప్రాధాన్యతే ప్రథమం. మిగిలినవన్నీ తర్వాత. సంస్కృతీ సంప్రదాయాలకి మూలమైన కుటుంబ వ్యవస్థను బలోపేతం చేస్తూ ఇంటిల్లి పాదినీ ఏకంచేసే పండగిది. సంవత్సర మంతా సుఖసంతోషాలను, శాంతిని పంచుతుంది. అందుకే ఎవరెక్కడున్నా కుటుంబసభ్యులందరినీ ఒక చోటుకు చేరుస్తుంది. అటు పుట్టింటిని, ఇటు మెట్టింటిని రెండు కళ్లుగా భావించే మనం పురుషుల కన్నా కాస్త ఎక్కువ సమానమంటే అతిశయం కాదు. అందుకే సంక్రాంతి సంబరాలు, ఆచారాలు స్త్రీలే కేంద్రంగా సాగుతాయి.
సందడే సందడి: ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసులు, గంగిరెద్దులు, భోగిమంటలు, భోగిపళ్లు, కొత్తబట్టలు, బొమ్మల కొలువులు, పిండి వంటలు, గాలిపటాలు, చెడుగుడు పోటీలు, పశువుల పందాలు ఒకటేంటి.. ఇల్లంతా, ఊరంతా ఒకటే హడావుడి. పంట చేతికి రాబోయే శుభ తరుణంలో సూర్యుడు దక్షిణాయణం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించే రోజే సంక్రాంతి. నిజానికి నెల ముందు నుంచే వైకుంఠద్వారం తెరిచిన ముగ్గుతో పండగ వాతావరణం మొదలవుతుంది.
వ్యవసాయ ప్రధానమైన మనదేశంలో ఫల సాయాన్ని అందుకుని భోగాన్ని అనుభవించే భోగితో ప్రారంభమౌతుందీ పండగ. ఆధ్యాత్మికంగా హేమంత వ్రతాన్ని చేసి కృష్ణుణ్ణి పొందిన గోపికల స్ఫూర్తితో గోదాదేవి జగన్నాథుని చేపట్టిన రోజు భోగి. గోదాదేవి రంగనాథుని చేరడం అంటే అది స్త్రీ పురుషుల చేరికైన కుటుంబ వ్యవస్థే కదా! గోదా అంటే గోతత్వాన్ని ఇచ్చేది. అందుకే ఈ నెలలో ఆవుపేడతో గొబ్బిళ్లు పెడతారు.
కుటుంబ వ్యవస్థ ధార్మికంగా అభివృద్ధి చెందాలంటే అనవసరమైన కోరికలు, ఆలోచనలు కూడదనే ఉద్దేశంతో భోగిమంట వేస్తారు. ఇంట్లో చెత్తనే కాక మనసులో చెత్తను కూడా తీసేయాలని సూచించే ఆచారమిది. కుటుంబాన్ని సక్రమ మార్గంలో నడిపించగలిగేది మన గృహ లక్ష్ములమే. ఆ ఔన్నత్యాన్ని గుర్తించడానికే లక్ష్మీస్వరూపమైన గొబ్బెమ్మల్ని ఉపాసించడం. కడుపు నిండా తిన్నప్పుడు కలిగే సంతృప్తి సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది.
అందుకే మన కడుపు నింపే ఫలసాయానికి, పౌష్యలక్ష్మికి ఇంటి ముందు రంగవల్లులు, గొబ్బమ్మలు స్వాగత తోరణాలుగా నిలుస్తాయి. పిల్లలు ఆయురారోగ్యాలతో వృద్ధిచెంది కుటుంబం బలోపేతం కావాలని భోగి పళ్లతో ఆశీర్వదిస్తాం. పండగనాడు పాడిపంటలకు కారణభూతుడు, ఆరోగ్య ప్రదాత అయిన సూర్యభగవానుణ్ణి ఆరాధిస్తాం. స్వర్గస్తులైన పెద్దల్ని తలచుకుని వారికి కొత్తబట్టలు నివేదిస్తాం.
మనకే ప్రాధాన్యత: కుటుంబమంటేనే ప్రేమ, ఆలంబన. అది విశ్వప్రేమనూ చాటుతుంది. అందుకే మనకు సహాయకారిగా ఉండే వివిధ వృత్తుల వాళ్లని ఈ పండగ సందర్భంగా ఆదరిస్తాం. పాడిపంటల్లో మనకెంతో సాయంగా ఉండే పశువుల్ని కనుమ రోజున అలంకరించి పూజించుకుంటాం. కుటుంబ వ్యవస్థను బలోపేతం చేస్తూ, అన్నింటికీ, అందరికీ, అన్ని వృత్తుల వాళ్లకీ ప్రాధాన్యతనిస్తూ అందరి పట్లా సమభావం, సమాదరణ చూపుతాం. ముఖ్యంగా మన ఆడవాళ్ల ఔన్నత్యాన్ని గుర్తించి, గౌరవించే పండగిది. ముగ్గుల నుంచి దానధర్మాల వరకూ మన చేతుల మీదుగానే జరుగుతాయి.
ఇవీ చదవండి: