అమలాపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో ఒకే భూమికి రెండుసార్లు చెల్లింపుల వ్యవహారంపై చర్యలు కొలిక్కివస్తున్నాయి. అయినవిల్లి మండలం కె.జగన్నాథపురంలో భూసేకరణ క్రమంలో ఇద్దరు రైతులకు రూ.3.25 కోట్లు అదనపు చెల్లింపులు జరిపిన విషయం తెలిసిందే. ఈ సొమ్ము వెనక్కి రప్పించే క్రమంలో రెవెన్యూ రికవరీ చట్టాన్ని ప్రయోగించడానికి ఓ వైపు సిద్ధమవుతున్న ఉన్నతాధికారులు మరోవైపు అదనపు చెల్లింపుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉద్యోగుల పాత్రపైనా ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా అమలాపురం ఆర్డీవో కార్యాలయ పరిపాలనాధికారికి జిల్లా కలెక్టర్ షోకాజ్ నోటీసు జారీ చేశారు. దీనిపై ఏవో వివరణ ఇచ్చారు.
ఈ వ్యవహారంపై ఎవరి నిర్లక్ష్యం ఎంత అన్నదానిపై స్పష్టమైన నివేదికను కలెక్టర్ మురళీధర్‌రెడ్డికి సంబంధిత అధికారులు సమర్పించారు. దీనిపై ఒకటి, రెండు రోజుల్లో కలెక్టర్ చర్యలు చేపట్టే అవకాశముందని తెలిసింది. కె.జగన్నాథపురంలో రాజారావు అనే వ్యక్తి నుంచి సేకరించిన 4.89 ఎకరాలు, ఆయన కుమారుడు రామసుబ్రహ్మణ్యం నుంచి సేకరించిన 1.89 ఎకరాలకు సంబంధించి రూ.3,25,44,000 వారి బ్యాంకు ఖాతాల్లో జమ కావాల్సి ఉండగా అధికారులు రెండు సార్లు చెల్లింపులు జరిపారు. దీనికి ఆర్డీవో కార్యాలయంలో డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ అధికారి నిర్లక్ష్యమే కారణమని ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ బాధ్యతలు ఏవో చూస్తుండడంతో ఆయన నుంచి వివరణ కోరారు.
దస్త్రాలు పూర్తిస్థాయిలో లేవన్న కారణంతో భూమికి పరిహారం చెల్లింపునకు సిఫార్సు చేసిన ఐడీని ధవళేశ్వరంలోని పే అండ్ అకౌంట్స్ కార్యాలయం అధికారులు తిరస్కరించగా.. దానిని రద్దు చేయకుండా మరో ఐడీతో కొత్త బిల్లులు పెట్టడంతో రెండుసార్లు సొమ్ము జమ అయ్యే పరిస్థితి తలెత్తినట్లు అధికారుల పరిశీలనలో తేలింది. తనకు కంప్యూటర్ పరిజ్ఞానం అంతగా లేదని, కంప్యూటర్ ఆపరేటర్ సాయంతో అప్‌లోడ్ చేసినట్లు ఏవో తన వివరణలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: