‘ఇష్టారీతిన చేస్తున్న అప్పులు, నిధుల దుర్వినియోగంపై కేంద్ర ప్రభుత్వం విచారణలు చేపట్టే స్థాయికి రాష్ట్ర ప్రతిష్ఠను సీఎం దిగజార్చారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. కాకినాడలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత రూ.1,56,848 కోట్లు అప్పు తెచ్చారు. సగటున రోజుకు రూ. 835 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ నిధులన్నీ ఎక్కడికి పోతున్నాయో ప్రజలకు సమాధానం చెప్పాలి. శాసనసభ సమావేశాలు కూడా నిర్వహించలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. కరోనా కష్టకాలంలో ప్రతి కుటుంబాన్నీ ఆదుకుంటామని హామీ ఇచ్చిన సీఎం ప్రస్తుతం ఉద్యోగులకు జీతాలు, విశ్రాంత ఉద్యోగులకు పింఛన్లు సకాలంలో ఇవ్వలేని స్థితిలో ఉన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కేంద్రం నుంచి నేరుగా జీతాలు వచ్చే ఏర్పాటు చేయాలని అడుగుతున్నారంటే, రాష్ట్ర ఖజానా ఏ స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ప్రభుత్వాసుత్రుల్లో కనీస వసతులు లేక నిరుపేద కుటుంబాలు తీవ్రంగా ఇబ్బంది పడ్డాయి. బ్లాక్‌ఫంగస్‌తో ప్రైవేటు ఆసుపత్రుల్లో రూ.లక్షల్లో ఖర్చు చేసి ఆర్థికంగా చితికిపోయారు.
మంత్రులకు శాఖలపై పట్టులేదు..
యువకుడు సీఎం అయితే తమ జీవితాల్లో మార్పు వస్తుందని నమ్మి 151 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే .. పరిపాలన మాత్రం ఒకరిద్దరు సలహాదారులతో సాగిస్తున్నారు. మంత్రులకు వారు చూస్తున్న శాఖలపై పట్టులేదు.. విలేకరుల సమావేశాలు సైతం సలహాదారులే ఏర్పాటు చేస్తున్నారు. పోలవరం నిర్వాసితులను ప్రభుత్వం దగా చేసింది. మంత్రివర్గ సమావేశం అనంతరం నిర్వాసితులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు ఇస్తున్నామని ప్రకటనలు చేశారు. గతంలో ప్రకటించిన రూ.6.50 లక్షలకు అదనంగా రూ.10 లక్షలు ఇస్తున్నారని అందరినీ నమ్మించారు. కానీ జీవోను ఇప్పటి వరకు విడుదల చేయలేదు. లక్ష కుటుంబాలు నిర్వాసితులైతే కేవలం 4,293 కుటుంబాలకే పునరావాసం అందించారు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద రూ.263కోట్లు మాత్రమే బిల్లులు ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు పనులూ ముందుకు కదలడం లేదు. జీవోలు ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారో సమాధానం చెప్పాలి. అభివృద్ధిలో రాష్ట్రం అట్టడుగుకు వెళ్లిపోయింది. ఉపాధి కల్పనపై సీఎంకు దృష్టిలేదు. రెండున్నరేళ్లలో ఒక పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదు. ఉన్నవి కూడా పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయి. రహదారుల పరిస్థితి దయనీయంగా ఉంది. మత్స్యకారులకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారు’ అని మనోహర్ ఆక్షేపించారు.
ఇదీ చదవండీ.. CM Jagan: ఉద్యాన రైతుల ఆదాయం పెంచేందుకు చర్యలు చేపట్టండి: సీఎం జగన్