తూర్పుగోదావరి జిల్లాలో..
కొత్తపేట మండలం మందపల్లిలో నాటు సారా తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మందపల్లికి చెందిన వీర వెంకట వర ప్రసాద్ నాటుసారా తరలిస్తున్నట్లు సమాచారం రావటంతో సిబ్బందితో వెళ్లి అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితుని నుంచి 45 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస నాయక్ తెలిపారు.
కడప జిల్లాలో..
రాజుపాలెం మండలంలో భారీగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం తీసుకొస్తున్నప్పుడు గోపనపల్లె చెక్ పోస్ట్ వద్ద గుర్తించారు. వారినుంచి 252 ఫుల్ బాటిళ్లతో పాటు.. మరో 42 బిరు సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు.. ప్రొద్దుటూరు గ్రామీణ సీఐ విశ్వనాథ రెడ్డి తెలిపారు. ఒకరిని అదుపులోకి తీసుకొని.. ఆటోను స్వాధీనం చేసుకున్నారు.
విశాఖ జిల్లాలో..
విశాఖ జిల్లా కశింకోట మండలం కొత్తపల్లి బుచ్చయ్యపేటలో కంటైనర్‌లో తరలిస్తున్న గంజాయిని కశింకోట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనకాపల్లి గ్రామీణ సీఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపల్లి బుచ్చయ్యపేటలో కంటైనర్ ఆగి ఉన్నట్లు గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. వాహనం క్యాబిన్లో పరిశీలించగా.. 338 కేజీల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. డ్రైవర్ పరారీలో ఉన్నట్లు గ్రామీణ సీఐ తెలిపారు.
అనంతపురం జిల్లాలో..
హిందూపురంలో మద్యం, కల్లు విక్రయదారులకు పోలీసులు ఎస్ఈబీ అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల దృష్ట్యా.. అక్రమంగా మద్యం, కల్లీకల్లు రవాణా, విక్రయాలు చేపడితే కఠిన చర్యలు తప్పవన్నారు. హిందూపురం పట్టణానికి దగ్గరగా కర్ణాటక రాష్ట్రం ఉండటంతో మద్యం అక్రమ రవాణాకు పాల్పడే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించించారు.
చిత్తూరు జిల్లాలో
బోయకొండ గంగమ్మ ఆలయం సమీపంలో అక్రమంగా మద్యం తరలిస్తున్న వెంకటరమణా రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పెద్దపంజాణి సరిహద్దు రాజుపల్లి చెక్‌పోస్టు వద్ద తనిఖీలు చేస్తుండగా.. పట్టుబడ్డాడు. నిందితుని నుంచి 18 కర్ణాటక మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారును సీజ్ చేసి.. పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.