Chandrababu Tour in Tensions : ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో చంద్రబాబు మూడో రోజు పర్యటన ఉద్రిక్తంగా సాగింది. పోలీసుల ఆంక్షలు.. చంద్రబాబు అనపర్తి వెళ్లకుండా అడ్డుకోవడంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబు కాన్వాయ్ వెళ్లకుండా పోలీసులు రోడ్డుపై వాహనాలు పెట్టడం.. రోడ్డుపై బైఠాయించడంతో చంద్రబాబు కాలినడకనే 8 కిలోమీటర్లు నడిచి అనపర్తి చేరుకున్నారు. చంద్రబాబుతో టీడీపీ శ్రేణులు నడిచారు. మధ్యలో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడక్కడ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అయినా ఆగకుండా చంద్రబాబు అనపర్తి చేరుకున్నారు.
సామర్లకోట నుంచి అనపర్తికి బయల్దేరిన చంద్రబాబును బలభద్రపురం దాటిన తర్వాత పోలీసులు అడ్డుకున్నారు. ఆయనను అడ్డుకునేందుకు పోలీసులు విఫలయత్నం చేశారు. ఆయన కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు రోడ్డుకు అడ్డంగా లారీలను, పోలీసు వాహనాలను నిలిపి ఉంచారు. అంతేకాకుండా కానిస్టేబుళ్లను.. చంద్రబాబు వాహన శ్రేణికి అడ్డంగా పోలీసు అధికారులు కూర్చోబెట్టారు. దీనికి నిరసనగా ఆయన కాన్వాయ్‌ను వదిలి కాలినడకన బలభద్రపురం నుంచి అనపర్తికి బయల్దేరారు.
కాలినడకన బయల్దేరిన తర్వాత చంద్రబాబు సుమారు గంట 15 నిమిషాలు ఆగకుండా 8 కిలోమీటర్లు నడిచారు. ఆయనను పోలీసులు అడ్డుకునేందుకు పోలీసులు బస్సులను అడ్డుగా ఉంచారు. వాటిని పక్కకు నెట్టి టీడీపీ శ్రేణులు చంద్రబాబును ముందుకు నడిపించాయి. ఈ క్రమంలో ఆయన పాదయాత్రగా అనపర్తికి వెళ్తున్న క్రమంలో రోడ్డు చీకటిగా ఉన్న సెల్ ఫోన్ లైట్ల వెలుతురులో నడుచుకుంటూ అనపర్తికి చేరుకున్నారు. అనపర్తికి చేరుకున్న అనంతరం ఆయన బహిరంగ సభలో పాల్గొన్నారు.
సుమారు 7 కిలో మీటర్ల దూరం నడిచి అనపర్తికి వచ్చాను. అనపర్తి నుంచి సహాయ నిరాకరణ ప్రారంభించానన్నారు. నేను పాకిస్థాన్ వచ్చానా.. నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారు. ఎన్నో అవమానాలు భరించి అనపర్తికి వచ్చాను. అనపర్తి వచ్చేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారని పేర్కొన్నారు. ఇచ్చిన అనుమతిని పోలీసులు ఎప్పుడైనా రద్దు చేస్తారట.. జగ్గంపేట, పెద్దాపురం పోలీసులు ఆయనకు సహకరించారు. ఖబడ్దార్.. గ్రావెల్ సూర్యనారాయణ.. జాగ్రత్తగా ఉండు.. భావితరాల భవిష్యత్తు కోసమే నేను పనిచేస్తున్నా. ఈ సైకో సీఎం.. పోలీసుల మెడపై కత్తిపెట్టారు. కార్యకర్తలను కొట్టడం పోలీసులకు మంచిది కాదు. -చంద్రబాబు
అధికారంలోకి వచ్చాక చట్ట వ్యతిరేక కార్యకలాపాలన్నీ సమీక్ష చేస్తాం. అక్రమాలకు పాల్పడిన పోలీసులనూ వదిలిపెట్టను.సీఎం కావాలని నేను పోరాటం చేయడం లేదు. జగన్ పాదయాత్రను మేం ఎప్పుడైనా అడ్డుకున్నామా.. అప్పుడు లేని ఆంక్షలు ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు. మాజీ సీఎంపై పోలీసులు వ్యవహరించిన తీరు బాగాలేదు. అరాచకాలను అడిగేవాళ్లే ఉండకూడదని అనుకుంటున్నారు.. వైసీపీ పాలనలో అన్ని పన్నులు పెరిగాయి. -చంద్రబాబు
కోడికత్తి డ్రామా ఆడిన వ్యక్తికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలని చంద్రబాబు ఎద్దేవా చేశారు. భూమి, ఇల్లు మీవని.. ఫోటోలు మాత్రం జగన్వని చంద్రబాబు దుయ్యబట్టారు. సైకో పాలన వల్ల రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని.. ధాన్యం కొనాలని అడిగిన రైతులపై కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రైతు వ్యతిరేకి అని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చి ఆక్వా రంగాన్ని బాగా దెబ్బతీసిందని ఆయన విమర్శించారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆక్వా రైతులకు 1.50 రూపాయలకే కరెంటు అందిస్తామని హామీ ఇచ్చారు.
పోలీసుల లాఠీచార్జ్‌లో చంద్ర దండు ప్రకాష్ నాయుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రకాష్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరం తరలించారు.
టీడీపీ శ్రేణులకు, పోలీసులకు మధ్య ఉద్రిక్తత : అంతకుముందు తెలుగుదేశం పార్టీ శ్రేణులు అనపర్తిలోని దేవిచౌక్ వద్ద టీడీపీ బహిరంగ సభను నిర్వహించటానికి ఏర్పాట్లు చేసింది. సభకు ముందుగా అనుమతిచ్చిన పోలీసులు.. తర్వాత లేదని తెలిపారు. టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు దేవిచౌక్ వద్దకు రాకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించుకుని పార్టీ శ్రేణులు దేవిచౌక్‌కు చేరుకున్నాయి.
వాహనం సీజ్: అనపర్తిలో చంద్రబాబు మాట్లాడిన వెహికల్‌ను పోలీసులు సీజ్ చేసారు. చంద్రబాబు ప్రసంగం ముగిసి దిగి వెళ్లిపోగానే ఆ వాహనాన్ని స్టేషన్‌కు తరలించారు. చంద్రబాబు మాట్లాడే మైకును పోలీసులు తీసుకువెళ్లిపోయారు.
ఇవీ చదవండి :