ఎగువ రాష్ట్రాల నుంచి వస్తోన్న వరదకు తోడు...రాష్ట్రంలో ఎడతెరిపిలేని వానలకు గోదావరికి భారీగా వరద పోటెత్తింది. భద్రచలం వద్ద గోదావరి వరద ప్రవాహం అంతకంతకూ పెరుతోంది. ఆ ప్రభావం దిగువన ఉన్న పశ్చిమగోదావరి జిల్లాపై తీవ్రంగా పడింది. ఫలితంగా జిల్లాలోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకొన్నాయి. ముంపుగ్రామాల రహదారులపైకి భారీగా వరదనీరు చేరింది. పదులసంఖ్యలో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వేల ఎకరాల్లో పంటనీటమునిగింది. లంకగ్రామాల్లోకి భారీగా వరద నీరు చేరి... రాకపోకలు నిలిచిపోయాయి. నాటు పడవల ద్వారా ప్రజలు నిత్యావసరాలు తెచ్చుకుంటున్నారు. పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో పలు గ్రామాలు రెండు రోజులుగా నీటిలోనే ఉన్నాయి. వేలేరుపాడు మండలం రేపాకుగొమ్మ, తాటకూరుగొమ్మ, తిరుమలాపురం, నార్లవరం, కటుకూరు, కోయిదా గ్రామాలు తీవ్రస్థాయిలో వరద తాకిడికి గురయ్యాయి. 29గ్రామాల్లోని పదివేల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పోలవరం వద్ద ఎగువ కాఫర్ డ్యాం నీరు పైకి ఎగదన్నడంతో ముంపు గ్రామాలను నీరు ముంచెత్తుతోంది. వరద పోటుతో పోలవరం మండలంలోని కొండ్రుకోట, తాటగుంట, కొరటూరు పంచాయతీల్లోని 19 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తెప్పల ద్వారా ప్రజలు ప్రయాణం సాగిస్తున్నారు. యలమంచలి మండలం కనకాయలంక, యలమంచలిలంక, దొడ్డిపట్ల లంకగ్రామాలు వరదనీటిలో చిక్కుకొన్నాయి. ఆచంట మండలంలోని అయోధ్యలంకతోపాటు.. మూడు గ్రామాలను వరదనీరు చుట్టుముట్టింది. వేలేరుపాడు, కక్కునూరు, పోలవరం మండలాల్లో సుమారు వేయి ఎకరాల వరకు పత్తిచేలు నీటమునిగాయి. లంకగ్రామాల్లో కూరగాయలు, ఇతర ఉద్యానపంటలు నీటమునిగాయి. ప్రధానంగా తమలపాకు తోటలు నీటమునగడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.
తూర్పుగోదావరి జిల్లానూ... వరద ముంచెత్తుతోంది. జిల్లాలో 19 మండలాలు వరద ముంపులో చిక్కుకున్నాయి. జిల్లాలోని అనేక లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. జిల్లాలోని మన్యంలోని ఎటపాక, రంపచోడవరం డివిజన్లలో ముంపు సమస్య జఠిలమైంది. దేవీపట్నం మండలం గత రెండు రోజులుగా వరద నీటిలో ఉంది. మండలంలోని దండంగి, పూడిపల్లి, తొయ్యేరు, దేవీపట్నం గ్రామాల ప్రజలు ముంపు సమస్యతో అవస్థలు పడుతున్నారు. రెండు వేల ఇళ్లు నీటిలోనే నానుతున్నాయి. ఎగువ కాపర్ డ్యాం పై ప్రాంతాలైన పోశమ్మగండి, పూడిపల్లి, తొయ్యేరు, దేవీపట్నం గ్రామాల ప్రజలు.. పరిస్థితి తీవ్రతతో బిక్కుబిక్కుమంటున్నారు. చింతూరు, వీఆర్‌పురం, కూనవరం, ముమ్మిడివరం, పి.గన్నవరం, సీతానగరం, రాజమహేంద్రవరం మండలాల్లోని గ్రామాలు వరద పోటులో చిక్కుకున్నాయి. ముమ్మిడివరం, పి.గన్నవరం మండలాల పరిధిలోని లంక గ్రామాలు పరిస్థితి తీవ్రంగా ఉంది. ఆయా ప్రాంతాల్లోని బాధితులకు ఆహార పొట్లాలు, వాటర్ పాకెట్లు సరఫరా చేస్తున్నట్లు అధికారులు వివరించారు.
వరదలు, వర్షాల కారణంగా కోనసీమలోని 65 గ్రామాల్లోని 1460 హెక్టార్లలో వరి పంట నీట మునిగింది. కూనవరం, ఎటపాక మండలాల్లోని 22 గ్రామాల్లోని 225 హెక్టార్లలో పత్తి పంట, 282 హెక్టార్లలో ఉద్యాన పంటలు నీట మునిగాయి. జిల్లాలోని రాజమహేంద్రవరం, రంపచోడవరం, ఎటపాక డివిజన్లలో ఏడు పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేసి ఇప్పటివరకూ 1,796 మందిని తరలించారు. సహాయ చర్యల్లో భాగంగా రెండు ఎస్ఆర్డీఎఫ్ బృందాలను రంగంలోకి దింపారు. కీలక శాఖల అధికారులతో 56 బృందాలు ఏర్పాటు చేశారు. లైఫ్ జాకెట్లు, జనరేటర్లు, ఎల్ఈడీ లైట్లు అందుబాటులో ఉంచారు. 53 మర పడవలు, ఏడు లాంచీలు సిద్ధం చేశారు.
గోదావరిలో వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయని జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి చెప్పారు. వరద పోటుకు గురయ్యే లోతట్టు గ్రామాలను గుర్తించి అప్రమత్తం చేసినట్లు తెలిపారు. పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్యసేవలకు ఎలాంటి లోటు రానీయకుండా చూస్తున్నామని పేర్కొన్నారు. మన్యంలో, లంక గ్రామాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేశామన్నారు.
ఇదీ చదవండి: 'అప్రమత్తంగా ఉండి బాధితులను ఆదుకోవాలి'