Flood to Godavari : మహారాష్ట్రతో పాటు తెలంగాణ నుంచి వస్తున్న వరదతో గోదావరిలో వరద పోటెత్తుతోంది. భద్రాచలం వద్ద గోదావరి మహోద్ధృతంగా ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద నీటిమట్టం 50.2 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. అక్కడి నుంచి ధవళేశ్వరం వద్దకు ప్రవాహం భారీగా చేరుతోంది. గోదావరి వరద రాజమహేంద్రవరం దగ్గర ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద తరలివస్తోంది. గురవారం రోజంతా వరద ఉద్ధృతి పెరుగుతూనే ఉంది. ధవళేశ్వరం దగ్గర 13.9 అడుగులకు నీటిమట్టం చేరింది. 13 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సముద్రంలోకి 12.24 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. డెల్టా పంట కాల్వలకు 4 వేల క్యూసెక్కులు వదులుతున్నారు.
అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి : భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండటంతో గోదావరి తీరం ప్రమాదకరంగా మారింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ విజ్ఞప్తి చేస్తోంది.
వరద నీటితో ప్రజలు ఇబ్బందులు : కోనసీమ ప్రాంతంలో వివిధ నదీపాయలు పోటెత్తి ప్రవహిస్తున్నాయి. పి.గన్నవరం డొక్కా సీతమ్మ అక్విడేట్టు వద్ద వైనుతీయ గోదావరి జోరుగా ప్రవహిస్తుంది. వశిష్ట, వైనితేయ గౌతమి గోదావరి నదీ పాయల్లో వరద వరవడి కొనసాగుతోంది. అయినవిల్లి మండలంలో వరద నీటితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముక్తేశ్వరంలోని ఎదురు బిడియం కాజ్వేకు వరద నీరు పోటెత్తింది. దీంతో రాకపోకలు సాగించేందుకు ప్రజలు వరద నీటితో ఇక్కట్లు పడుతున్నారు. ముక్తేశ్వరం రేవు అయినవిల్లిలంక, వీరవెల్లిపాలెం అద్దంకివారిలంక గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. వరద ప్రాంతాన్ని పి.గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు పరిశీలించారు.
నీట మునిగిన పంట పొలాలు : ముమ్మిడివరం నియోజకవర్గంలో లంకగ్రామాలకు వరదతాకిడి పెరిగింది.. ధవలేశ్వరం బ్యారేజీ నుండి దిగువకు 10 లక్షలు క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి వదలడంతో వృద్ధ గౌతమి గోదావరి నదీపాయ పల్లం వారి పాలెం వివేకానంద వారి వద్ద పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తోంది. దీని ప్రభావం లంక గ్రామాలపై పడింది. వరద ప్రవాహంతో గురజాపులంక గ్రామంలో నివాస గృహలకు సమీపంలో గట్టు కోతకు గురౌవుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. పంట చేతికి వచ్చే సమయంలో ఇలా పంటలు నీటి పాలు కావడంతో ఎంతో కొంత పంటనైన దక్కించుకునేందుకు రైతులు శ్రమిస్తున్నారు. మెట్ట పంటలే జీవనాధారంగా కుటుంబాలను పోషించుకుంటున్నామని.. వేలకు వేలు పెట్టుబడి పెడితే తీరా పంట చేతికి వచ్చే సమయానికి వరదల పాలై, నష్టాలు వస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.