తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం వద్ద శనివారం స్వల్పంగా తగ్గుముఖం పట్టిన గోదావరి వరద ఆదివారం ఉదయం నుంచి క్రమేపీ పెరిగింది. ఎగువ కాఫర్ డ్యాం వెనుక భాగంలో ఉన్న పోశమ్మగండి నుంచి కొండమొదలు వరకూ గోదావరి వరద పెరగడంతో నిండుకుండలా జలకళలాడుతోంది. గండిపోశమ్మ అమ్మవారి పాదాలను వరద నీరు తాకింది. నిర్వాసితులు ఇళ్లను ఖాళీ చేసి కొండలపైకి చేరుకున్నారు. ఏ.వీరవరం వద్ద కడమ్మవాగుకు వరద నీరు పోటెత్తడంతో అక్కడి నిర్వాసితులు పునరావాస కాలనీలకు చేరుకుంటున్నారు.
12, 13 తేదీల్లో పాపికొండల యాత్ర నిలిపివేత
గోదావరిలో వరద నీరు పెరుగుతుండటంతోపాటు తుపాను నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా ఈనెల 12, 13 తేదీల్లో పాపికొండలు విహారయాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఏపీటీడీసీ డివిజనల్ మేనేజర్ వీరనారాయణ తెలిపారు. 14న పాపికొండలకు బోట్లు వెళ్లేది లేనిది ముందుగానే చెబుతామన్నారు. వర్షాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
ఇదీ చదవండీ..Sirisha bandla: శిరీష రోదసీ యాత్ర విజయవంతం.. తెనాలిలో హర్షాతిరేకాలు