పాపికొండల విహార యాత్రకు వెళ్తూ తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలో కచ్చూలూరు మందం వద్ద గోదావరిలో మునిగిపోయిన బోటు మధ్యాహ్నానికి బయటకు వచ్చే అవకాశం కన్పిస్తోంది. సుడిగుండాలు లేకపోవటం, గోదావరి నీటిమట్టం 38-40 అడుగుల స్థాయిలోనే ఉండటంతో బోటును వెలికి తీసేందుకు సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. వరుసగా ఐదురోజు నీటిమట్టం తగ్గడం అనూకూలించింది. రాయల్ వశిష్ట పర్యాటక బోటు వెలికితీత పనులను కాకినాడ పోర్టు అధికారి కెప్టెన్ ఆధినారాయణ పర్యవేక్షిస్తున్నారు.
విశాఖపట్నం నుంచి వచ్చిన ఓం శివశక్తి అండర్ వాటర్ సర్వీసెస్ కు చెందిన పదిమంది డ్రైవర్లలో నాగరాజు, స్వామి అనే ఇద్దరు ఆదివారం ఉదయం పదకొండు గంటలకు బోటు మునిగిన ప్రదేశంలో నీటి అడుగు భాగంలోకి వెళ్లారు. దాదాపు 15 నిమిషాలపాటు ఆ ప్రాంతంలో బోటు ఎలా ఉంది? దాని చుట్టూ ఇసుక,మట్టి ఎంతమేర పెరుకుపోయాయి? అనే కోణంలో పోర్టు అధికారికి వివరించారు.
మధ్యాహ్నానికి పనులు పూర్తయ్యే అవకాశం
ఆదివారం బోటును తీయటానికి వెళ్లిన బృందం.... బోటు పంఖా ఇసుకలో కూరుకుపోవటం, అద్దాలన్నీ మూసుకుపోవటంతో షాప్టుకు తాడు కట్టలేకపోయారు. అనంతరం ఒడ్డుకు చేరుకున్న డ్రైవర్లకు అధికారులు బోటుకు ఎక్కడ తాడుకట్టాలో అవగాహన కల్పించారు. దీంతో తిరిగి వెలికితీతకు వెళ్లిన వారు బోటు వెనుక భాగంలో తాడును బలంగా కట్టి బయటికి చేరుకున్నారు. నేడు ముందు భాగంలో తాడుని బిగించి పొక్లెయిన్ సాయంతో మధ్యాహ్నంలోపు పనులు పూర్తవుతాయని ఆదినారాయణ తెలిపారు.
బయటకు వచ్చిన మృతదేహం
బోటును కొంతమేర కదలించటంతో నల్లప్యాంటు, టీ షర్టుతో తలలేని మృతదేహం బయటికి వచ్చింది. మృత దేహం ముద్దగా గుర్తించలేని విధంగా ఉందని వైద్యాధికారి తెలిపారు
ఇవీ చదవండి