తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నీటి ప్రవాహం పెరగడంతో పోచమ్మగండి వద్ద ఉన్న గండి పోచమ్మ ఆలయం పూర్తిగా నీట మునిగింది. అమ్మవారి ఆలయ గోపురాన్ని వరద తాకింది. ఆలయంతో పాటు సమీపంలోని ఇళ్లు నీట మునిగాయి. మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం మండలాల్లోని 30 గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్ డ్యాం వద్ద గోదావరి నీటిమట్టం 30 మీటర్లకు చేరుకుంది. దీంతో ముంపు గ్రామాలపై తీవ్ర ప్రభావం పడిందని ప్రజలు వాపోతున్నారు. గోదావరికి వరద పెరగడంతో ఆయా ప్రాంతాల్లో అధికారులు సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ చర్యలు తీసుకుంటున్నారు.
వరద ప్రవాహం పెరుగుతున్నందు బూరుగ లంక రేవులో తాత్కాలిక రహదారి కొట్టుకుపోయింది. నాలుగు లంక గ్రామాల ప్రజలకు బాహ్య ప్రపంచానికి రావటానికి సంబంధాలు తెగిపోయాయి. వీరు ఇప్పటి నుంచి అక్టోబర్ వరకు పడవల ద్వారానే రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. తమకు వరద కష్టాలు మొదలయ్యాయని.. ఈ లంక గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: