రెండు విశ్వవిద్యాలయాల్లోని వసతి గృహాల్లో ఆహారంలో కప్ప, కాకి ఈక వచ్చిన ఘటనలు తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో చోటు చేసుకున్నాయి.
ఉప్మాలో కప్ప: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం సమీపంలోని నన్నయ విశ్వవిద్యాలయంలో ఆదివారం బాలికల వసతి గృహంలో ఉప్మాలో చనిపోయిన కప్ప కనిపించడంతో బాలికలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఉదయం ఉప్మా తయారు చేసి ఒక పెద్ద గిన్నెను బాలుర వసతి గృహానికి, మరొకటి బాలికల వసతి గృహానికి పంపారు.
బాలికల వసతి గృహంలో సుమారు 75 శాతం మంది ఉప్మా తిన్నాక ఆ గిన్నెలో చనిపోయిన కప్ప కనిపించింది. ఈ విషయం తెలుసుకున్న రిజిస్ట్రార్ టి.అశోక్ వసతి గృహానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి బాలికలకు ధైర్యం చెప్పారు. సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల వంట రుచికరంగా ఉండటం లేదని, పురుగులు ఉంటున్నాయని వంట మనుషులను మార్చాలని వసతి గృహ విద్యార్థులు ఆందోళన చేశారు.
భోజనంలో కాకి ఈక: ఆంధ్ర విశ్వవిద్యాలయం నాగార్జున వసతిగృహంలో విద్యార్థులకు పెట్టిన భోజనంలో కాకి ఈక కనిపించడం కలకలం రేపింది. శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకోగా విద్యార్థులు ఆందోళనబాట చేపట్టారు. ఆదివారం తెల్లవారుజామున ఐదు గంటలకే మెస్‌లోకి సిబ్బంది వెళ్లకుండా తాళం వేసి నిరసన తెలియజేశారు. ఇంత దారుణమైన భోజనం ఎక్కడా చూడలేని వాపోయారు. వసతి గృహంలో ఆహారం సరిగా లేకపోవడంతో కొంతమంది బయటకు వెళ్లి భోజనం చేస్తున్నారని తెలిపారు. భోజన సమయంలో తప్ప మిగతా సమయంలో తాగునీరు అందుబాటులో ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోకపోగా, వసతిగృహంలో ఇతర విద్యార్థులు ఉంటున్నారని తనిఖీలు నిర్వహించారని ఆరోపించారు. చీఫ్ వార్డెన్ విజయమోహన్, వార్డెన్ హరనాథ్ విద్యార్థులతో చర్చించి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో శాంతించి మెస్ తాళం చెవి ఇచ్చారు.
వంట మనుషులను మారుస్తాం..: నాగార్జున వసతిగృహంలో భోజనం సరిగా లేదని విద్యార్థుల నుంచి ఫిర్యాదులు వచ్చినట్లు వార్డెన్ హరనాథ్ తెలిపారు. త్వరలో వంట మనుషులను మారుస్తామని చెప్పారు. వసతిగృహంలో 250 మంది విద్యార్థులు కాకుండా, ఇతరులు కూడా ఉండడంతో తాగునీటికి ఇబ్బంది కలుగుతోందన్నారు. శాతవాహన వసతిగృహం మరమ్మతులు దాదాపు పూర్తయ్యాయని, రంగులు వేయాల్సి ఉందన్నారు. పనులు పూర్తయిన తర్వాత నాగార్జున వసతి గృహం విద్యార్థులను శాత వాహనంలోకి మార్పు చేస్తామని చెప్పారు.
ఇవీ చదవండి: