తూర్పుగోదావరి జిల్లా రంగంపేటకు చెందిన మావిరెడ్డి శ్రీనివాస్.. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు. ప్రైవేటుగా ఉన్నత విద్య చదువుతూనే, సాగులో నిమగ్నమయ్యారు. మేలైన పచ్చి మేతకు డిమాండ్ పెరగడాన్ని గమనించారు. అలా 2012లో అటువైపు అడుగులేశారు. తొలుత ఎకరం భూమిలో 'కో-4' రకం మేత సాగు చేశారు. గడ్డికి ఉన్న గిరాకీ దృష్ట్యా మరికొంత భూమి కౌలుకు తీసుకొని ఉత్పత్తి పెంచారు. 2015 నుంచి 20 ఎకరాల్లో సూపర్ నేపియర్ రకం సాగు చేస్తూ.. ఏటా నాలుగైదు విడతలుగా ఎకరానికి 200 టన్నుల వరకు దిగుబడి తీస్తున్నారు.
గడ్డితోపాటే మొక్కజొన్న పంటతో సైలేజ్ దాణా తయారు చేస్తున్నారు శ్రీనివాస్. రైతుల వద్దే నేరుగా మొక్కజొన్న కొంటూ.. యంత్రం సాయంతో సైలేజ్ దాణాగా మార్చుతున్నారు. దాన్ని ప్యాకింగ్ చేసి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, విశాఖ, విజయనగరం జిల్లాలకు సరఫరా చేస్తున్నారు.మొక్కజొన్న పంటను సైలేజ్ కోసం అమ్మడం వల్ల.. గతానికంటే అధిక ఆదాయం వస్తోందని రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
పచ్చిగడ్డి, సైలేజ్ తయారీలో పాల్పంచుకుంటూ ఉపాధి పొందుతున్న కూలీలు.. ఏడాదంతా పని ఉంటోందని ఆనందంగా చెబుతున్నారు. రంగంపేట రైతు శ్రీనివాస్ సేవలకు గుర్తింపుగా సీటీఆర్ఎల్ గత ఏడాది ఉత్తమ రైతు పురస్కారం అందించింది. పశుసంవర్థక శాఖ సలహాదారుగా కూడా నియమించింది.