తూర్పుగోదావరి జిల్లాలోని రక్షిత అటవీ ప్రాంతంలో నిర్మించిన రహదారిలో లేటరైట్ నిల్వలతో వెళ్లే భారీ వాహనాలకు అనుమతులివ్వలేదని అటవీశాఖ స్పష్టం చేసింది. గిరిజనుల విద్య, వైద్యం, నిత్యావసరాలు, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా అవసరాల కోసమే ఆ రహదారి నిర్మాణానికి అనుమతించినట్లు తెలిపింది. రక్షిత అటవీ ప్రాంతమంతా నిషేధిత ప్రదేశమని అనుమతి లేనిదే ఎవరూ సంచరించకూడదని వివరించింది. రహదారి ఉన్న రౌతులపూడి సెక్షన్ పరిధిలో 8,519.99 హెక్టార్లు రక్షిత అటవీ ప్రాంతమని... అడవి పందులు, కొండగొర్రె, కణుజు, చవులపిల్లి వంటి వన్యప్రాణులున్నాయని పేర్కొంది.
విశాఖపట్నం జిల్లా నాతవరం మండలంలోని బమిడికలొద్ది క్వారీలో లేటరైట్ తవ్వకాలు జరిపి... ఆ నిల్వలను తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలం అటవీ ప్రాంతంలోని చల్లూరు-దబ్బాది-సార్లంక-సిరిపురం గ్రామాల మీదుగా నిర్మించిన రహదారిలో భారీ వాహనాల్లో తరలించటం ఇటీవల వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాకినాడకు చెందిన ఓ వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నలకు ఏలేశ్వరం రేంజి అటవీ అధికారి జె.శ్రీనివాస్ సమాధానాలిచ్చారు. గిరిజనుల సౌకర్యాలు, అవసరాల కోసమే రక్షిత అటవీ ప్రాంతంలో భారీ వాహనాలు తిరిగే వీలుందని ఆయన వివరించారు. సహ చట్టం ద్వారా వెల్లడైన మరికొన్ని అంశాలివి.
* చల్లూరు నుంచి దబ్బాది వరకూ రక్షిత అటవీ ప్రాంతంలో నిర్మించిన రహదారికి 2019 డిసెంబరు 20న, సార్లంక నుంచి సిరిపురం వరకూ రక్షిత అటవీ ప్రాంతంలో నిర్మించిన రహదారికి 2021 జూన్ 16న కాకినాడ జిల్లా అటవీ అధికారి అనుమతులిచ్చారు. దబ్బాది, సార్లంక, సిరిపురం పంచాయతీల్లో ఈ రహదారి నిర్మాణానికి అనుమతులు కోరుతూ గ్రామసభ తీర్మానాలు చేశాయి. రహదారి నిర్మాణంలో జీవవైవిధ్యానికి ఎలాంటి నష్టమూ జరగలేదు. చల్లూరు నుంచి దబ్బాది మార్గంలో 14, సార్లంక నుంచి సిరిపురం మార్గంలో 8 మారుజాతి చెట్లు తొలగించాం. ఆ కలప అంతా అటవీశాఖ ఆధీనంలో ఉంది. దాని వేలం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది.
* తూగో జిల్లా అటవీ ప్రాంతంలో గనుల తవ్వకాలకు ఎలాంటి అనుమతీ ఇవ్వలేదు. ప్రస్తుతం తవ్వకాలు సాగుతున్న బమిడికలొద్ది క్వారీ ప్రాంతం విశాఖపట్నం జిల్లాలో ఉంది. మంజూరు చేసిన క్వారీ వివరాలను గనుల శాఖ తూర్పుగోదావరి జిల్లా అటవీశాఖకు సమర్పించలేదు.
లేటరైట్ తవ్వకాలపై ఎన్జీటీ బృందం పరిశీలన నేడు..
విశాఖ జిల్లా నాతవరం మండలం బమిడికలొద్ది లేటరైట్ క్వారీలో తవ్వకాలను పరిశీలించేందుకు జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) నియమించిన బృందం బుధవారం పర్యటించనుంది. ఈ మేరకు గనులశాఖ అధికారులకు సమాచారం అందింది. ఈ బృందంలో అటవీశాఖ ఉన్నతాధికారి, అసిస్టెంట్ ఐజీ ఎల్లన్ మురుగన్, శాస్త్రవేత్త సురేశ్‌బాబు, విశాఖ జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున, విశాఖ డీఎఫ్‌వో అనంతశంకర్, కాలుష్య నియంత్రణ మండలి కార్యనిర్వాహక ఇంజినీరు ప్రమోద్‌కుమార్‌రెడ్డి, గనుల శాఖ ఉప సంచాలకుడు సూర్యచంద్రరావు సభ్యులుగా ఉన్నారు.
ఇదీ చదవండి: