తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం ఎదురులంక పరిధిలో.. వందలాది ఎకరాల లంకభూములు గౌతమి గోదావరికి చేరువనున్నాయి. మూడు తరాల క్రితం ఆ భూముల్లో కొబ్బరి చెట్లనుండి వచ్చే ఫలసాయం.. అందులోనే అంతర్ పంటగా వేరుశనగ, జనుము వేసి అదనపు ఆదాయంతో కుటుంబాలను పోషించుకుంటూ.. పిల్లలను ఉన్నత చదువులకూ పంపేవారు. అదంతా గతం. ఆ వందల ఎకరాలు ఇప్పుడు పదుల్లోకి వచ్చేశాయి. తరాలుమారి కుటుంబాలు విడిపోవడం వలన కాదు. గోదావరి వరదల వలన ఇలా తగ్గిపోయాయి... సారవంతమైన లంక భూములు. ప్రతి ఏటా వచ్చే వరదలకు లంకభూములు కోతకు గురవుతున్నా.. రైతులు ఎన్నిసార్లు ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. ఇంతకాలం ప్రభుత్వాలు ఈ సమస్య నివారణకు పూర్తి స్థాయిలో ఏ చర్యలు చేపట్టలేదు.
సీఎం పునాది వేసినా ప్రయోజనం లేదు..
గత ఏడాది నవంబరు 21న జిల్లా పర్యటనకు వచ్చారు.. ముఖ్యమంత్రి జగన్. ముమ్మిడివరంలో 70 కోట్ల రూపాయల వ్యయంతో లంక భూములు కోత నివారణ పనులకు పునాది వేశారు. ఆ తర్వాత... ఈరోజు వరకూ పది రాళ్ళు అక్కడ వేసిన పాపాన పోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. గతవారం వచ్చిన వరదలకు ఉన్నకాస్త లంకభూమి, కొబ్బరి చెట్లు కోతకు గురై గోదావరిలో కలసిపోయాయని పేద రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే పనులు చేపట్టాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: