కేంద్ర పాలిత ప్రాంతం యానాంలో మొదటి కరోనా కేసు నమోదైంది. హైదరాబాద్‌లో ఒక ప్రైవేటు మీడియా సంస్థలో పనిచేసే కుటుంబానికి చెందిన 12 ఏళ్ల బాలుడికి పాజిటివ్ ఉన్నట్లు యానాం వైద్య శాఖ అధికారులు నిర్ధారించారు.
ఈనెల 15న హైదరాబాద్ నుంచి తల్లిదండ్రులు ఈ బాలుడిని తీసుకొచ్చి యానాం కనకాలపేట గ్రామంలో ఉన్న తాతయ్య ఇంటి వద్ద వదిలివెళ్లారు. ఈ క్రమంలో స్థానిక అధికారులు బాలుడిని ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రంలో ఉంచి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించారు. చిన్న పిల్లవాడని తమ ఇంటి వద్ద ప్రత్యేక గదిలో ఉంచుతామని అధికారులకు తెలిపి రెండు రోజుల కిందట బాలుడి బంధువులు ఇంటికి తీసుకెళ్లారు. అప్పటినుంచి బాలుడు కుటుంబ సభ్యులతో పాటు తోటి పిల్లలతో కలిసిమెలిసి తిరిగాడు. శుక్రవారం స్వల్పంగా జ్వరం రావటంతో కుటుంబ సభ్యులు కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. ఈ రోజు వచ్చిన రిపోర్టులో బాలుడికి కరోనా పాజిటివ్‌గా తేలింది.
అప్రమత్తమైన అధికార యంత్రాంగం
మూడు నెలలుగా శక్తివంచన లేకుండా 24 గంటలు కంటికి రెప్పలా యానాం ప్రజలను కాపాడుతూ వచ్చినా... పాజిటివ్ కేసు నమోదు కావటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కనకాలపేట గ్రామంలోకి రాకపోకలు నిషేధించారు. బాలుడి ఇంటి పరిసర ప్రాంతాలను శానిటైజ్ చేసి బ్లీచింగ్ చేశారు. 500 మీటర్ల పరిధిని రెడ్‌జోన్‌గా ప్రకటించారు. బాలుడితో సన్నిహితంగా మెలిగిన వారందరికీ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. వారి కుటుంబ సభ్యులతో గత నాలుగు రోజులుగా కలిసిన వారు స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకోవాలని డిప్యూటీ కలెక్టర్ శివరాజ్ మీనా కోరారు.
మూలాలు
బాలుడు తండ్రి హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు మీడియా సంస్థలో ఉద్యోగి కావడం... ఇటీవల ఎక్కువమంది మీడియా ప్రతినిధులు కరోనా బాధితులు కావటంతో ముందు జాగ్రత్తగా తన కుమారుని తాతగారింటికి తీసుకొచ్చారు. కానీ అప్పటికే తండ్రికి వైరస్ ఉండి అతని ద్వారా బాలుడికి వైరస్ సోకి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈనెల 15 నుంచి మూడు రోజులపాటు ప్రభుత్వ క్వారంటైన్లో ఉండటంతో అతనితో పాటు ఉన్న ఎనిమిది మందికి తిరిగి మళ్లీ కరోనా పరీక్ష నిర్వహించనున్నట్లు డిప్యూటీ కలెక్టర్ తెలిపారు.