తూర్పు గోదావరి జిల్లాలో "అమూల్య" రకం వరి విత్తనాలు వేసిన రైతులు లబోదిబోమంటున్నారు. వరంగల్‌కు చెందిన మహేంద్ర సీడ్స్ సంస్థకు నుంచి ఈ వరి విత్తనాలను కొనుగోలు చేశామని 14 మండలాల రైతులు చెబుతున్నారు. ఈ విత్తనాలను దాదాపు 15 వందల మంది రైతులు కొనుగోలు చేసి, 5 వేల ఎకరాల్లో సాగుచేశారు.
అయితే.. సాధారణంగా 120 రోజుల్లో రావాల్సిన పంట.. 40 రోజులకే కంకులు రావడం మొదలెట్టాయి. వరి దుబ్బలు నాలుగైదు కంటే ఎక్కువ రాక పోవడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ఈ రకం విత్తనాలు వేసిన అందరి పరిస్థితీ ఇదే విధంగా ఉండటంతో.. తాము మోసపోయామని గ్రహించారు. నకిలీ విత్తనాలను సంస్థ తమకు అంటగట్టిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అప్పులు చేసి మరీ సాగు చేపడితే.. నకిలీ విత్తనాల రూపంలో తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆవేదన చెందుతున్నారు. తమకు నకిలీ విత్తనాలను అంటగట్టిన సంస్థ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. బాధిత రైతులు కిర్లంపూడిలో ధర్నా నిర్వహించారు. తక్షణమే పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
అమూల్య రకం వరి విత్తనాలతో నష్టపోయిన రైతుల పొలాలను వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ వ్యవహారం వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు దృష్టికి తీసుకెళ్లగా.. మహేంద్ర సీడ్స్ సంస్థ నుంచి పరిహారం రాబట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి: Heavy Rains : అనంతలో భారీ వర్షం.. రైతన్నల హర్షం..