తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలో వరి సాగు చేసిన కౌలు రైతులను... తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు నిండా ముంచాయి. వాతావరణంలో మార్పులు గమనించి కొంతమంది రైతులు కోసిన చేలల్లోని వరిని గట్టుకుచేర్చి కుప్పలుగా వేసి వర్షం నుంచి రక్షణ కొరకు టార్పాలిన్ కవర్లు కప్పి నిశ్చింతగా ఉన్నారు. నాలుగు రోజులపాటు ఎడతెరిపి లేకుండా కురుసిన వర్షాలకు ఆ కుప్పల్లోకి సైతం నీరుచేరింది. అయితే ప్రస్తుతం ఎండలు కాస్తుండటంతో కుప్పలు నూర్చేందుకు రైతులు సిద్ధమయ్యారు. టార్పాలిన్ కవర్ తీసి చూడగా వరిపనలన్నీ మొలకలొచ్చి ఉండడంతో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు తమ ఆకలిని ఎవరు తీరుస్తారంటూ ఆవేదన చెందుతున్నారు.
పిల్లల బంగారం కుదవపెట్టి
భర్త మరణించటంతో కుటుంబ పోషణ కోసం... చేతికందొచ్చిన కుమార్తెతో కలిసి ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి మూడెకరాలు కౌలుకు తీసుకుంది నారాయణమ్మ అనే మహిళా రైతు. కుటుంబమంతా రేయింబవళ్లు కష్టపడి పని చేశామన్నారు. తీరా పంట చేతికి వచ్చేసరికి వర్షాలు పూర్తిగా నాశనం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కౌలు చెల్లించక తప్పదు. తాకట్టు పెట్టిన బంగారం తెచ్చే దారీ కానరాదు. ఏ రకంగా బతకాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి.
-నారాయణమ్మ, కౌలు రైతు
ఇదే విధంగా వేల ఎకరాల్లోని పంటను నష్టపోయిన కౌలురైతులు... ప్రభుత్వం ఇచ్చే పంట నష్ట పరిహారం తమకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: