తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చి మనసును ఆకట్టుకునేవి ప్రధానంగా రెండు. పచ్చగా కళకళలాడుతూ ఉండే కొబ్బరి తోటలు, గోదావరి నదీపాయలు వాటి పై నిర్మించిన వంతెనలు. పగటిపూట ఈ ప్రాంతాలు ఎంత ఆహ్లాదంగా ఉంటాయో రాత్రిపూట అంత భయానకంగా ఉంటాయి. అందుకు కారణం.. లంకల మధ్య ఉండే గ్రామాలకు వెళ్లే రహదారుల్లో విద్యుద్దీపాలు లేకపోవడమే.
గ్రామాల మాట అటుంచితే.. పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ రెండింటిని కలుపుతూ గౌతమి గోదావరి నదిపై.. ఐ.పోలవరం మండలం ఎదుర్లంక, యానాం మధ్య నిర్మించిన వంతెన దుస్థితి మరీ దారుణంగా ఉంది. రెండు కిలోమీటర్ల పొడవైన వారధికి కృషి చేసిన కోనసీమ ముద్దుబిడ్డ లోక్సభ మాజీ స్పీకర్ దివంగత జీఎంసీ బాలయోగి పేరును రెండు రాష్ట్రాల అంగీకారంతో పెట్టారు. కొన్నేళ్లుగా వంతెన నిర్వహణ బాధ్యతను రెండు రాష్ట్రాలు గాలికి వదిలేశాయి.
విద్యుత్ దీపాల ఏర్పాటు వాటి నిర్వహణ బిల్లుల చెల్లింపు వంటి అంశాలను పుదుచ్చేరి ప్రభుత్వం యానం ప్రజాపనుల శాఖ ద్వారా నిర్వహించేది . అప్పట్లో నెలకు లక్ష నుంచి 3 లక్షల రూపాయలు ఖర్చు అయ్యేది. తర్వాత కాలంలో విద్యుత్ చార్జీలు, స్లాబు విధానం మారటంతో నిర్వహణ వ్యయం పెరగింది. యానం ప్రజా పనుల శాఖ చేతులెత్తేసింది. విద్యుత్ దీపాల నిర్వహణ బాధ్యతను రెండు ప్రభుత్వాలు వదిలేశాయి.
వంతెనపైన విద్యుత్ దీపాల స్తంభాలతో పగలంతా అలంకారంగానూ.. రాత్రి అవి వెలగక అంధకారంగా వారధి కనిపిస్తోంది. పెద్ద వాహనాల హెడ్ లైట్ వెలుగులు తప్పించుకునేలోగా చిన్న వాహనదారులు ప్రమాదాలకు గురైన సంఘటనలు చాలానే ఉన్నాయి. ఇదే విధంగా మురుమళ్ల వద్ద వృద్ధ గౌతమి గోదావరి నదిపై నిర్మించిన రాఘవేంద్ర వారధిపై ఏర్పాటుచేసిన సోలార్ దీపాలు వెలగట్లేదు. తమ సమ్యలను పరిష్కరించాలని వాహనదారులు కోరుతున్నారు.
ఇదీ చూడండి: