తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం చెయ్యేరు గున్నేపల్లిలో ఓ యువకుడు కనిపించకుండా పోయిన కేసు ఆరు నెలల తర్వాత హత్యగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి అదే గ్రామానికి చెందిన ఒక మహిళతో సహా ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్లు అమలాపురం డీఎస్పీ మసూద్ భాష తెలిపారు. నిందితుల నుంచి రూ.5000 నగదు, మూడు సెల్ ఫోన్లు, ఒక ఉంగరం ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
అసలేం జరిగిందంటే...
చెయ్యేరు గున్నేపల్లిలో మృతుడు వాండ్రపు రామకృష్ణ, వాండ్రపు శ్రీనివాస ప్రసాద్ వరసకు అన్నదమ్ములు. వీరిద్దరి మధ్య ఇంటి సరిహద్దు విషయంలో గొడవలు ఉండేవి. 2019 జూన్ నెలలో రామకృష్ణ శ్రీనివాస్‌ను దూషించటంతో అతన్ని ఎలాగైనా హతమార్చాలని శ్రీనివాస్ అనుకున్నాడు. తనకు పరిచయం ఉన్న స్థానిక వీఆర్ఏ వరప్రసాద్‌కు విషయం చెప్పి వ్యూహం రచించారు.
ప్రథకం ప్రకారం రామకృష్ణకు పరిచయమున్న ఓ మహిళను అడ్డంపెట్టుకుని..ఆమె ఇంటికి రామకృష్ణ వచ్చే ఏర్పాటు చేశారు. 2019 డిసెంబర్ 8వ తేదీన సాయంత్రం 6 గంటలకు ప్లాట్‌కి చేరిన రామకృష్ణను ముగ్గురు కలిపి నైలాన్ తాడు మెడకు బిగించి హత్య చేసారు.
రామకృష్ణ మృతదేహాన్ని ఆ రోజు రాత్రి 9:30 గంటలకు శ్రీనివాస్, సత్య వరప్రసాద్ ద్విచక్రవాహనంపై పది కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలువలో బలమైన రాయికట్టి వదిలేశారు.
కొద్దిరోజుల తరువాత మృతుని తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు నిందితులను పట్టుకున్నారు.
ఇదీ చూడండి: అయ్యో పాపం: అమ్మ, చెల్లెమ్మ కోసం.. పదేళ్ల పసివాడు.. ఎంతటి కష్టం చేశాడమ్మా!