తూర్పుగోదావరి జిల్లా కోనసీమ వాసులు బయట ప్రాంతాలకు వెళ్లేందుకు రావులపాలెంలోని గౌతమి గోదావరిపై 1967లో వంతెన నిర్మించారు. సుమారు మూడు కిలోమీటర్ల మేర వంతెన నిర్మించి ప్రజల రాకపోకలు సాగించేందుకు మార్గం ఏర్పాటు చేశారు. వంతెన మొదటి నుంచి చివరి వరకు ఏర్పడ్డ గోతులు ప్రయాణికులకు గండాలుగా మారాయి.
15 ఏళ్ల క్రితం జాతీయ రహదారిపై నాలుగు లైన్లుగా విస్తరించడంతో పాత వంతెన పక్కన కొత్త వంతెన నిర్మించారు. నాటి నుంచి పాత వంతెన పైనుంచి రాజమహేంద్రవరానికి వెళ్లే వాహనాలు కొత్త వంతెనపై రాజమహేంద్రవరం నుంచి వచ్చే వాహనాలు ప్రయాణం సాగించేలా ఏర్పాటు చేశారు. నిర్వహణ లోపం కారణంగా మార్గం దారుణంగా మారింది.
పాత వంతెనపై రహదారి అంతా గుంతులమయమైంది. ఆరు సంవత్సరాల క్రితం పాత వంతెన మధ్యలో ఉండే ఇనుప రాడ్లు తొలగించి కొత్తవి ఏర్పాటు చేశారు. స్లాబ్‌కు మరమ్మతులు చేసి రహదారికి రూపునిచ్చారు. మూడు సంవత్సరాలకు పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. వర్షాకాలం నేపథ్యంలో రహదారి మరింత దారుణంగా తయారయింది.
తారు రోడ్డు మొత్తం పోయి వంతెన స్లాబు బయటకు కనిపిస్తుంది. కొన్నిచోట్ల స్లాబ్ సిమెంట్ సైతం పోయి ఇనుప రాడ్లు కనిపిస్తున్నాయి. రాత్రి సమయాల్లో గోతులు తెలియక వేగంగా వచ్చి వాటిలో పడి వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. కొన్ని సమయాల్లో ద్విచక్ర వాహనదారులు పడిపోయి ప్రాణాలు పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి వంతెన స్లాబ్ మరమ్మతులు చేసి రోడ్డు నిర్మించాలని వాహనదారులు కోరుతున్నారు.