రాష్ట్రంలో నాలుగు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వందల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి.
కృష్ణా జిల్లాలో..
కృష్ణా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మచిలీపట్నంలో ప్రధాన రహదారులతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బస్‌స్టాండ్ , జిల్లా పరిషత్ కార్యాలయాల పరిసర ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కైకలూరులోని కొల్లేరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పెనుమాకలంక పెద్ద ఎడ్ల గాడి రోడ్డుపైకి వరద నీరు చేరింది. కొల్లేరు లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
కర్నూలు జిల్లాలో..
కర్నూలు జిల్లా నంద్యాలలో జోరు వాన కురిసింది. సంజీవనగర్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు రహదారులు జలమయమయ్యాయి. పద్మావతినగర్‌లో మురుగునీరు రహదారిపైకి చేరుకోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
అనంతపురం జిల్లాలో..
అనంతపురం జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు చిత్రావతి నది పరవళ్లు తొక్కుతోంది.
కడప జిల్లాలో..
కడప జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు.. సిద్ధవటం మండలంలోని పెన్నా నది ఉగ్రరూపం దాల్చింది. గండికోట రిజర్వాయర్ నుంచి నీరు వదలడంతో నీరంతా నదిలోకి చేరుతోంది. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కడప శివారులోని అల్లూరి సీతారామరాజు నగర్‌లోని ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరింది. ఇళ్లల్లోని సామగ్రి నీటమునగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మురుగు వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్ల ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో..
తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం అప్పన్నపాలెంలో ఏలేరు నీటి ఉద్ధృతికి కాజ్ వే వంతెన దెబ్బతింది. ఈ వంతెన కుంగిపోవడంతో మర్రిపాక, ఇర్రిపాక, మామిడాడ, నరేంద్రపట్నం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఏలేశ్వరంలోని ఏలేరు జలాశయంలోని అదనపు జలాలను కిందకు వదలటంతో విష పురుగులు, కొండ చిలువలు గ్రామాల్లోకి వస్తున్నాయి. కిర్లంపూడి మండలం లంక గ్రామ పొలాల్లో సంచరిస్తున్న కొండ చిలువను గ్రామస్థులు చంపారు.
పశ్చిమగోదావరి జిల్లాలో..
పశ్చిమ గోదావరి జిల్లాలో కుండపోత వర్షాలకు తాడేపల్లిగూడెం, నిడదవోలు మధ్యలో ఉన్న మాధవరం రహదారి ఎర్ర కాలువ ఉగ్రరూపానికి కొట్టుకుపోయింది. కొన్ని వందల ఎకరాల పంట నీట మునిగిందని రైతులు వాపోతున్నారు. గోపాలపురం మండలం వెదుళ్ళకుంటలో తాడిపూడి సబ్ కెనాల్‌కు గండి పడి వేల ఎకరాలు నీట మునిగాయి. కుండపోత వర్షాలకు విశాఖ మన్యంలో వాగులు, గెడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. చింతపల్లి మండలంలో వంతెన పైనుంచి వరద నీరు ప్రవహించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కొయ్యూరు మండలం కాకరపాడు సమీపంలో కాలువ ఉద్ధృతికి వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
వర్షాలతో నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించాలని రైతులు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి : భక్తుల మనోభావాలతో ఆటలాడుకోవడం దుర్మార్గం : చంద్రబాబు