Construction of roads withstand rains: నల్లరేగడి భూములున్న ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఏటా వర్షాలకు రహదారులు అధ్వానంగా మారుతున్నాయి. ఫలితంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరమ్మతులు, పునరుద్ధరణ పనులు ఆలస్యమైతే రహదారులు పూర్తిగా ధ్వంసమైపోతున్నాయి. ఇలాంటి మార్గాల్లో కొన్నింటిని ఎంచుకుని.. వర్షపు నీటిని తట్టుకొనేలా దృఢంగా నిర్మించేందుకు రహదారులు, భవనాల శాఖ కసరత్తు చేస్తోంది.
ఇలా చేస్తారు..
దెబ్బతిన్న రహదారిని అడుగు లోతు తవ్వేస్తారు. వ్యర్థాలను తొలగించకుండా అలాగే ఉంచుతారు. వాటిపై సిమెంట్ పొడి చల్లి, ప్రత్యేకమైన రసాయనాలు వేస్తారు. తర్వాత రోటవేటర్ యంత్రంతో వాటిని కలుపుతారు. రహదారి అంతటా అవి కలిశాక పైన నీటిని నిలిపి, సిమెంట్ రహదారుల మాదిరి కొద్ది రోజులు క్యూరింగ్ చేస్తారు. ఫలితంగా రహదారి బేస్.. కాంక్రీట్‌లా మారుతుంది. దాని కోర్‌తీసి నాణ్యత పరిశీలించాక, పైన తారు రోడ్డు వేస్తారు. ఈ బేస్ పదేళ్లపాటు దెబ్బతినదని, వాననీరు ఇంకే వీలుండదని ఇంజినీర్లు చెబుతున్నారు. పైన తారు రోడ్డు దెబ్బతింటే, ఆ మేరకు బీటీ లేయర్ వేస్తే సరిపోతుంది. పలు రాష్ట్రాల్లో ఈ విధానాన్ని అమలు చేయగా, ఏపీలోనూ పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని కొన్ని రహదారుల్లో ప్రయోగం చేసినట్లు ఆర్‌అండ్‌బీ ఇంజినీర్లు పేర్కొన్నారు. మరికొన్ని జిల్లా, గ్రామీణ రహదారుల్లో ప్రయోగాత్మక నిర్మాణంపై ఉన్నతస్థాయిలో ఇటీవల ఇంజినీర్లు సమావేశం నిర్వహించారు. త్వరలో రహదారుల ఎంపిక పూర్తి చేసి, నిర్మిస్తామని ఓ చీఫ్ ఇంజినీర్ చెప్పారు. కోర్ పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తే ఎక్కువ కిలోమీటర్ల మేర పనులు చేపట్టడంపై దృష్టి పెడతామన్నారు.
ఇదీ చదవండి:
'వచ్చే ఎన్నికల్లో తెదేపా ఒంటరిగా పోటీ చేస్తుందని చెప్పగలదా?': మంత్రి అనిల్