కరోనా కేసుల తీవ్రతలో తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ నగరం అగ్రస్థానంలో ఉంటే.. రెండో స్థానంలో రాజమహేంద్రవరం నగరం ఉంది. కాకినాడ నగరంలో ఇప్పటివరకూ 5,387 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నగరంలో మొత్తం 50 డివిజన్లు ఉంటే ఎనిమిది వార్డులు మినహా మిగిలిన అన్ని చోట్లా కేసుల జాడ కనిపిస్తోంది.
జిల్లా కేంద్రం కాకినాడకు నిత్యం జిల్లా నలుమూలల నుంచి ప్రజలు వస్తుంటారు. లాక్‌డౌన్‌లో పరిస్థితి కాస్త అదుపులో ఉన్నా.. సడలింపుల తర్వాత అదుపు తప్పింది. నగరంలో ఆరు ప్రధాన మార్కెట్లు ఉన్నాయి. నిత్యం రద్దీగా ఉండే మెయిన్‌రోడ్డు, దేవాలయం వీధి, సినిమారోడ్డు, కల్పన కూడలి ప్రాంతాల్లోనూ ఎక్కువ రద్దీ కన్పిస్తోంది. ప్రజలు కనీస జాగ్రత్తలు పాటించకపోవడమే వైరస్ వ్యాప్తికి కారణమవుతోంది.
వాణిజ్య కేంద్రంగా పేరున్న రాజమహేంద్రవరంలో 50 డివిజన్లు ఉంటే.. 30 డివిజన్లలో వైరస్ తీవ్రత కన్పిస్తోంది. ఇక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య 3,688కి చేరింది. రాజమహేంద్రవరం నగరంలో తాడితోట, మెయిన్‌రోడ్డు, ఎస్వీజీ మార్కెట్లకు ఉభయగోదావరి జిల్లాల తాకిడి ఉంటుంది. నిత్యం బయట నుంచే లక్షమందికి పైగా వస్తారు. ప్రధానంగా కంబాల చెరువు, దేవీచౌక్, మెయిన్‌రోడ్డు, డీలక్స్ సెంటర్, తాడితోట, బైపాస్ తదితర రోడ్లు నిత్యం రద్దీగా ఉంటాయి. నిత్యావసరాలు, ఇతర వ్యాపారాల సముదాయాల వద్ద ప్రజలు కనీస జాగ్రత్తలు పాటించకపోవడం వైరస్ వ్యాప్తికి కారణమవుతోంది.
జిల్లాలో కాకినాడ, రాజమహేంద్రవరం నగరాల్లో కోవిడ్ కేసుల తీవ్రత ఎక్కువ ఉంటుందనే సంకేతాలు ముందు నుంచే ఉన్నాయి. కరోనా కట్టడికి అన్ని చర్యలూ తీసుకుంటున్నా కొందరి నిర్లక్ష్యం వైరస్ వ్యాప్తికి కారణమయిందని అధికారులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ కోవిడ్ నిబంధనలు పాటించాలని అధికారులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: