కార్మికుల వైద్య సేవల్లో ఇబ్బందులకు త్వరలో తెరపడనుంది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో 100 పడకల ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణం పనులు చురుగ్గా సాగుతున్నాయి. 117 కోట్ల రూపాయల వ్యయంతో కాకినాడలోని సాంబమూర్తి నగర్ లో ఆసుపత్రి నిర్మాణం పనులు సాగుతున్నాయి.
తెదేపా హయాంలో మంజూరు..
కాకినాడ ప్రాంత ప్రజలకు శిథిల భవనాల్లో గతంలో అరకొర వైద్యం అందేది. జిల్లా కేంద్రం నుంచి కార్మికులు రాజమహేంద్రవరం ఈఎస్ఐ ఆసుపత్రికి వెళ్లే పరిస్థితి ఉండేది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అప్పటి ఎంపీ తోట నరసింహం హయాంలో కాకినాడకు ఈఎస్ఐ ఆసుపత్రి మంజూరైనా.. సాంకేతిక కారణాలతో నిర్మాణానికి నోచుకోలేదు. వైకాపా ప్రభుత్వ హయాంలో కాకినాడ ఎంపీ వంగా గీత చొరవతో ఎట్టకేలకు ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది. శంకుస్థాపన అనంతరం పనులు ఊపందుకున్నాయి.
భారత ప్రభుత్వ గృహ నిర్మాణ అర్బన్ డెవలప్మెంట్ మంత్రిత్వశాఖ పర్యవేక్షణలో జై ప్రకాష్ సంస్థ కాకినాడలోని 7.26 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఏడాది మార్చి నెలలో నిర్మాణ పనులు ప్రారంభించింది. ఆస్పత్రితో పాటు సిబ్బంది క్వార్టర్స్, 90 కిలో లీటర్ల సమర్థ్యంతో వ్యర్ధజలాల శుద్ధి కేంద్రం, విద్యుత్ సబ్ స్టేషన్, సోలార్ వాటర్ హీటింగ్ సిస్టం ఇతర పనులు చేపట్టనున్నారు. ఈ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే కాకినాడ, తుని, యానాం తదితర ప్రాంతాల లక్ష మంది బీమా కార్మికులకు ముల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: అనపర్తి మండలంలో 12 మంది విద్యార్థులకు కరోనా