రాష్ట్రంలోని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా, జిల్లా, బోధనాసుపత్రుల్లోని వైద్య పరికరాల నిర్వహణ వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగంపై సీఐడీ కేసు నమోదు చేసింది. బెంగళూరుకు చెందిన టీబీఎస్ టెలిమెటిక్ అండ్ బయోమెడికల్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో పాటు వివరాలు తెలియని ప్రైవేటు వ్యక్తులు, ప్రభుత్వ ఉద్యోగుల్ని నిందితులుగా పేర్కొంది.
తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం అవిడి గ్రామానికి చెందిన ఇందుకూరి వెంకటరామరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసింది. జాతీయ ఆరోగ్య మిషన్ నిబంధనలకు విరుద్ధంగా టీబీఎస్ ఇండియా టెలిమెటిక్ అండ్ బయోమెడికల్ సంస్థతో వైద్యపరికరాల నిర్వహణ ఒప్పందం కుదుర్చుకున్నారని, ఆ సంస్థతో అధికారులు కుమ్మక్కయ్యారని రామరాజు ఫిర్యాదులో పేర్కొన్నట్లు సీఐడీ ఎఫ్‌ఐఆర్‌లో ప్రస్తావించింది.
‘‘ఆసుపత్రుల్లోని వైద్య పరికరాల ధరల్ని అధికంగా చూపించి.. నిర్వహణ ఛార్జీల పేరిట భారీగా బిల్లులు పొందారు. వారంటీ ఉన్న పరికరాలకు కూడా మరమ్మతులు చేపట్టినట్లు చూపి నిధులు కాజేశారు. తనిఖీ లేకుండానే ఆసుపత్రుల్లోని వైద్య పరికరాల విలువ 450- 480 కోట్లు ఉంటుందని అంచనాకొచ్చేసి టెండర్లు అప్పగించేశారు. రూ.400 కోట్ల విలువైనాలేని పరికరాలను రూ.500 కోట్లుగా చూపించి వాటిపై నిర్వహణ ఛార్జీల రూపంలో అనుచిత లబ్ధి పొందారు’’ అని ఫిర్యాదుదారు పేర్కొన్నారని సీఐడీ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది.
సీఎంకు సోము వీర్రాజు లేఖ
గత ప్రభుత్వ హయాంలో జరిగిన వైద్య పరికరాల కుంభకోణం కేసు విచారణ వేగంగా పూర్తి చేసి, దోషులను పట్టుకోవాలని కోరుతూ సీఎం జగన్‌కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ రాశారు. ‘ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో ఉపకరణాల నిర్వహణ కాంట్రాక్టుల్లో జరిగిన భారీ కుంభకోణంపై సీఐడీ కేసును వేగంగా విచారించి, దోషులను న్యాయస్థానం ముందు నిలబెట్టాలి. 2015లో నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు టెండర్లు ఖరారు చేశారని ఆరోపణలు వచ్చాయి. టెండరు దక్కించుకున్న సంస్థ ఉపకరణాల విలువను మార్కెట్ ధర కంటే ఎన్నో రెట్లు అమాంతం పెంచేసి మోసానికి పాల్పడింది’ అని లేఖలో పేర్కొన్నారు.
ఇదీ చూడండి: