CENTRAL MINISTER CHAUHAN : ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై జగన్ సర్కార్ ఉదాసీనంగా వ్యవహరిస్తోందని కేంద్ర సమాచారశాఖ సహాయమంత్రి దేవ్ సింహ్ చౌహాన్ ఆరోపించారు. రాజమహేంద్రవరంలో పర్యటించిన ఆయన.. కేంద్రపథకాలకు ప్రధాని ఫొటో పెట్టడం లేదని విమర్శించారు. కేంద్రం చేపట్టిన అభివృద్ధి పనులకు రాష్ట్ర వాటా ఇవ్వడం లేదని మండిపడ్డారు. ప్రజాస్వామ్య విధానాలకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ పని చేస్తోందన్న కేంద్రమంత్రి.. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
"గ్రామాల అభివృద్ధి కోసం కేంద్రం నిధులు ఇస్తుంది. పంచాయతీల్లో ఉన్న నిధులను ఎలాంటి పనులకు వినియోగించాలన్న దానిపై సర్పంచ్, స్థానిక అధికారులకు అధికారం ఉంటుంది. వైసీపీ సర్కార్ పరిశ్రమలను నడపడం లేదు. ఇక్కడి ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక కార్యకలాపాలు చేయడం లేదు. దీంతో ఇక్కడి ప్రజలు వలస వెళ్తున్నారు. నిరుద్యోగంతో యువతలో నిరాశ నెలకొంది. మద్యం, గనులపైనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంది" -దేవ్ సింహ్ చౌహాన్ , కేంద్ర సమాచారశాఖ సహాయ మంత్రి
ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అత్యధిక నిధులు కేటాయిస్తున్నారన్నారు. పోలవరం ఎత్తు, నీటి నిల్వ సామర్థ్యం పెంచలేదని, అటువంటప్పుడు ప్రాజెక్టు వ్యయం ఎలా పెరుగుతుందని ప్రశ్నించారు. అంచనాలు పెంచడంలో అవినీతి జరిగే అవకాశాలున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వివిధ అభివృద్ధి పనులు, పథకాల కోసం కేంద్రం ఇస్తున్న నిధులు పక్కదారి పడుతున్నాయని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, వైసీపీలకు దూరంగా ఉంటామన్నారు.
ఇవీ చదవండి: