తూర్పుగోదావరిజిల్లా అంతర్వేది సాగర సంగమం వద్ద కాకినాడకు చెందిన సోనాబోటు బుధవారం ప్రమాదానికి గురైంది. దీనిలో చేపల వేటకు వెళ్లిన 9 మంది మత్స్యకారులు సురక్షితంగా బయటపడ్డారు. కాకినాడలో ఏటిమొగలో ఆకుల శివకు చెందిన సోనాబోటులో అదే ప్రాంతానికి చెందిన బి.సత్తిబాబు, ఎస్.సురేంద్ర, ప్రసాద్, ఎం.శ్రీను, కల్యాణ్, రామ్, శ్రీను, రాజు, పి.శ్రీనులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లారు.
సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో అంతర్వేది మినీహార్బర్కు చేరడానికి బుధవారం సాయంత్రానికి తిరుగు ప్రయాణం చేశారు. ఈ క్రమంలో స్థానిక సాగర సంగమం వద్ద సముద్రంలో ఉన్న ఇసుక మేటలు గుర్తించకపోవడంతో బోటుకు ఇసుక మేట తగిలి ప్రమాదానికి గురైంది. వెంటనే మత్స్యకారులు బోటు యజమానికి చారవాణిలో సమాచారం ఇవ్వడంతో యజమాని విషయాన్ని స్థానిక మెరైన్ పోలీస్ స్టేషన్లకు తెలిపారు. మెరెన్ పోలీసులు ఓలేటి శివ, నాగార్జున, స్థానికంగా ఉన్న చిన్న బోటు తీసుకుని మునిగిపోతున్న బోటు వద్దకు చేరుకున్నారు. బోటు ఉన్న ప్రాంతం అంతా ఇసుక మేటలు ఉండటంతో వారు నడిచివెళ్లి చిన్న బోటుపై మత్స్యకారులను ఎక్కించుకుని ఒడ్డుకు చేర్చారు. అయితే సుమారు 40 లక్షల విలువ చేసే బోటు అలల తాకిడికి పగిలి పోతుందని మత్స్యకారులు వాపోతున్నారు.
ఇదీ చదవండి: