తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం బొమ్మూరు వద్ద తెదేపా ప్రభుత్వం హయాంలో పేదల కోసం ఇళ్లు నిర్మించారు. 1,232 ఇళ్లను ఒకేచోట వివిధ బ్లాకుల్లో చేపట్టి నిర్మాణం పూర్తి చేశారు. రహదారులు కూడా నిర్మించారు. గతంలోనే లక్కీ డ్రాలో లబ్ధిదారులను ఎంపిక చేశారు. ప్రభుత్వ మారిన తర్వాత వాటిని లబ్దిదారులకు ఇంకా అందించడం లేదు. బొమ్మూరు గృహ సముదాయంలో ఎస్టీపీ ప్లాంటు, తాగు నీటి ట్యాంకు నిర్మాణం మినహా అన్ని వసతులు కల్పించారు. 161.76 కోట్ల ప్రాజెక్ట్ వ్యయంలో ఇంకా 50 కోట్ల రూపాయల వరకు పెండింగ్ ఉన్నట్టు నిర్మాణ సంస్థ ఎన్సీసీ చెబుతోంది. మరోవైపు లబ్దిదారులు ఇళ్లలోకి ఎప్పుడు వెళ్లేది తెలీక గందరగోళంలో ఉన్నారు. బొమ్మూరు గృహ సముదాయంలో అక్కడక్కడ పిచ్చి మొక్కలు మొలిచాయి. ఏ బ్లాకులోని మూడో అంతస్తులో ఉన్న కిటికీ అద్దాలను ఆకతాయిలు పగలగొట్టారు. కొందరు రాత్రివేళల్లో మద్యం తాగుతున్నారు. అప్పులు చేసి మరీ లక్ష రూపాయలు చెల్లించిన పేదలు మాత్రం తమకు ఎప్పుడు ఇళ్లు అప్పగిస్తారో తెలియక గందరగోళంలో ఉన్నారు.
కాకినాడలోనూ ఇదే పరిస్థితి
కాకినాడలోని పర్లోపేటలో పేదల కోసం గృహ సముదాయన్ని గత ప్రభుత్వం ప్రారంభించింది. ఇక్కడ 2,720 ఇళ్ల నిర్మాణాలు చేపట్టాల్సి ఉండగా...1152 ఇళ్లు నిర్మించారు. నిర్మాణాలు నిలిచిన చోట పిచ్చిమొక్కలు మొలిచాయి. ప్రస్తుతం ఇక్కడ ఒక్క బ్లాక్ నిర్మాణం మాత్రమే పూర్తయింది. ఇంకా బీ, సీ బ్లాకుల నిర్మాణం చేపట్టాలి. రహదారులు, డ్రైనేజీ, విద్యుత్, తాగునీటి సౌకర్యం కల్పించాల్సి ఉంది. నిధుల కొరతవల్ల పనులు నిలిచిపోయాయి. కొంత మంది లబ్దిదారులు.. తమ వాటా కింద నగదు చెల్లించారు. ఎప్పుడు ఇళ్లు ఇస్తారంటూ.. దీనస్థితిలో అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో వివిధ పట్టణాల్లో నిర్మించిన ఇళ్ల కోసం లబ్దిదారులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి ఇవ్వాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: 75వేల ఇళ్లు సిద్ధం... అయినా పేదలకు అందవేం!