తూర్పు గోదావరి జిల్లా మెట్ట ప్రాంత రైతులను నివర్ తుపాను కోలుకోలేని దెబ్బ తీసింది. గత నెలలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఏలేరు పొంగి తీర ప్రాంతాల్లోని పంటలు మునిగిపోయాయి. ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం, పెద్దాపురం నియోజకవర్గాలలో ఎక్కువ పంట నష్టం జరిగింది. బొప్పాయి, పత్తి, వరి, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి.
అరటి రైతుకు కోలుకోలేని దెబ్బ
పంటకాపుకొచ్చిన అరటి...నివర్ తుపాను ధాటికి పడిపోవటంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. చేతికందే సమయానికి గెలలు నేలరాలిపోయాయని వాపోయారు. ప్రత్తిపాడు మండలం లంపకలోవ, ఉత్తరకంచి, రౌతుపాలెం, కిట్టమూరిపేటల్లో పంట ఎక్కువగా దెబ్బతింది. ప్రభుత్వం సాయమందించి..తమను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. నియోజకవర్గంలోని వందల ఎకరాల్లో వరి, పత్తి, కూరగాయలు, అరటి పంటల నష్టం జరిగిందని స్థానిక నేతలు సైతం రైతుల పక్షాన గళమెత్తారు. భారీ స్థాయిలో పంటలు దెబ్బతిన్నా.. ఇప్పటివరకూ అధికారులు గానీ, ప్రజాప్రతినిధులు గానీ వచ్చి పరిశీలించకపోవటం దురదృష్టకరమని ఆవేదన చెందారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి..పంట నష్టం అంచనా వేయాలని... రైతులకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
"నివర్ కారణంగా మొత్తం పంట దెబ్బతింది. చెట్లన్నీ విరిగి అరటి గెలలు నేలరాలాయి. అప్పులు తెచ్చి వేలల్లో పెట్టుబడి పెట్టాం. ఇప్పుడు పంట అంతా చేజారిపోయింది. ఇప్పటి వరకూ అధికారులు ఎవరూ రాలేదు. ప్రభుత్వం స్పందించి..నష్టాన్ని అంచనా వేసి..పరిహారం ఇప్పించాలని కోరుతున్నాం" -బాధిత రైతులు
ఇదీ చదవండి:
కోట్లు కుమ్మరించిన దరిచేరని జలాలు... చెంతనే ప్రాజెక్టులున్నా తప్పని ఎదురుచూపులు