రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ప్రతిష్ఠను దిగజార్చేలా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారనే ఆరోపణలతో సఖినేటిపల్లి పోలీసులు నమోదు చేసిన కేసులో... చల్లా రవి అనే వ్యక్తికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ప్రాథమికంగా చూస్తే పిటిషనర్ పై నిందారోపణ మోపుతూ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ సరైనది కాదని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు.
చనిపోయిన వ్యక్తిని ఉద్దేశించే నేపథ్యం ఉన్న పాటతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఫోటోలను వాట్సాప్, ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారని.. తద్వారా రాపాక ప్రతిష్ఠను దిగజార్చేలా వ్యవహరించారనే ఆరోపణతో ఎమ్మెల్యే అనుచరుడు ఒకరు ఫిర్యాదు చేశారు. దీంతో చల్లా రవిపై సఖినేటిపల్లి ఠాణాలో ఈ ఏడాది జులై 2 న ఐపీసీ సెక్షన్ 153 (ఏ) , 505 (2) , ఎస్సీఎస్టీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిలు కోసం రవి హైకోర్టును ఆశ్రయించారు.
దస్త్రాలను పరిశీలించిన న్యాయమూర్తి .. పిటిషనర్ న్యాయవాది వాదనలతో ఏకీభవించారు. ప్రస్తుత కేసులో పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు వర్తించవని చెప్పారు. వివిధ వర్గాల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టడం, తెగలు, పుట్టిన ప్రాంతం, నివాస స్థలం, భాషాపరమైన విషయాల్లో శత్రుత్వం పెంచాలన్న ఉద్దేశంతో ఎవరైన వ్యవహరిస్తే ఐపీసీ సెక్షన్ 153 (ఏ) వర్తిస్తుందని గుర్తు చేశారు. మతం, కులం, భాష తదితర విషయాల్లో శత్రుత్వం , ద్వేషం పెంచేందుకు ప్రచురణలు, ప్రకటనలు, పుకార్లను వ్యాప్తి చేస్తే ఐపీసీ సెక్షన్ 505 (2) వర్తిస్తుందన్నారు.
ప్రస్తుత కేసు విషయంలో అలాంటిదేమి లేదన్నారు. ఈ క్రమలో ఐపీసీ సెక్షన్ 153 (ఏ), 505 (2) ప్రకారం నేరం జరగలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద నమోదు చేసిన సెక్షన్లు వర్తించవని తీర్పు చెప్పారు. ముందస్తు బెయిలు మంజూరు చేశారు. పోలీసులు అరెస్ట్ చేస్తే.. పూచీకత్తులు సమర్పించిన వెంటనే విడుదల చేయాలని కూడా ఆదేశించారు.
ఇదీ చదవండి: