ఆ రోడ్లపై రోజుకు ఎంతోమంది ప్రయాణిస్తుంటారు.. రోడ్లు గతుకులమయంగా మారినా అలాగే వెళ్లిపోతుంటారు.. ప్రభుత్వం రోడ్లు వేస్తే బాగుంటుందని అంటుంటారు. కానీ ఆ ఆటోడ్రైవర్ మాత్రం అలా ఆలోచించలేదు.. రోడ్లపై గర్భిణీలు, మహిళలు పడుతున్న కష్టాలు చూసి చలించాడు. రోడ్డు నిర్మిచలేకపోయినా.. గుంతలు పూడిస్తే కొంతవరకైనా ప్రయాణం సాఫీగా సాగుతుందని భావించాడు.. ఆలోచనే వచ్చిందే ఆలస్యం కొంతమంది యువకులతో కలిసి రోడ్లపై గుంతలు పూడ్చి అందరితో శభాష్ అనిపించుకుంటున్నాడు ఆటోడ్రైవర్ రమణ.
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలంలో భీమ్‌నగర్ నుంచి బి.కొత్తూరు వరకు రహదారి గుంతలు పడి అధ్వానంగా మారింది. రోడ్లపై ప్రయాణిస్తున్న వారు ఆసుపత్రుల పాలవుతున్నారని ఆటో డ్రైవర్ రమణ ఆవేదన చెందారు. రోడ్డు నిర్మించలేకపోయినా.. కనీసం పెద్ద పెద్ద గుంతలైన పూడ్చాలని నిర్ణయించుకున్న డ్రైవర్ రమణ.. సొంత ఖర్చుతో రోడ్డు మరమ్మతులు చేపట్టారు.
వారం క్రితం ద్విచక్ర వాహనంపై ఇద్దరు వెళ్తుండగా.. ఓ మహిళ గుంతల కారణంగా కిందపడడంతో తలకు తీవ్రగాయమైంది. అదే సమయంలో ఆ మార్గంలో వెళ్తున్న నరసింగపురం గ్రామానికి చెందిన కొత్తపల్లి రమణ.. తన ఆటోలో ఆమెను తీసుకెళ్లి.. 108 అంబులెన్సు ఎక్కించారు. ఈ పరిస్థితులను చూసి చలించిన రమణ.. రూ.25 వేలు వెచ్చించి క్రషర్ పొడి తెప్పించారు. మంగళవారం భీమ్‌నగర్ నుంచి నరసింగపురం, జములపల్లి వరకు నాలుగున్నర కిలోమీటర్ల మేర ఉన్న పెద్దపెద్ద గుంతలను పూడ్చివేశారు. అతనితోపాటు నరసింగపురానికి చెందిన యువత శ్రమదానం చేశారు. ప్రయాణికులు రమణ సేవా దృక్పథాన్ని ప్రశంసిస్తున్నారు.
ఆటోలో వెళ్తున్నప్పుడు గర్భిణీలు, బాలింతలు ఇబ్బందులు పడుతున్నారు. వారి కష్టాలను తీర్చాలనే లక్ష్యంతో అప్పుచేసి, రోడ్లపై గుంతలను పూడ్చివేశారు. -రమణ, ఆటో డ్రైవర్
ఇదీ చదవండి:
Strike with Oil Tankers : నిలిచిపోయిన 1200 పెట్రోల్ ట్యాంకర్లు.. అంతా వాళ్లే చేస్తున్నారట!