చంద్రబాబు... జగన్తో రాష్ట్రాభివృద్ధి సాధ్యం కాదని... మోదీని మళ్లీ ఆశీర్వదిస్తేనే ఆంధ్రప్రదేశ్ పురోగమిస్తుందని భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్షా పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో అమిత్షా గురువారం పర్యటించారు. పుల్వామాలో ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. ఈ ఐదేళ్లలో దేశ భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చామన్న అమిత్ షా... భారత సైనికులకు భాజపా ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
ఉగ్రవాదుల పీచమణచడంలో సైనికులకు ప్రధాని మోదీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని పేర్కొన్నారు. వీరమరణం పొందిన జవాన్ల అంశాన్ని కాంగ్రెస్ రాజకీయం చేసిందని ధ్వజమెత్తారు. భాజపా దేశభక్తిని ప్రశ్నించే నైతిక హక్కు ఏ పార్టీకి లేదన్నారు. ఏపీ సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరం రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. పుణ్యమూర్తులు నడిచిన ఈ నేలకు రావడం గర్వంగా ఉందని పేర్కొన్నారు.
విభజన బిల్లులోని అంశాలను కేంద్రం 90 శాతం అమలు చేసిన విషయం ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు. 20 జాతీయ సంస్థలు, 8,800 మెగావాట్లు, రహదారులను రాష్ట్రానికి కేంద్రం అందించిందని వివరించారు. పీఎంఈవై, మరుగుదొడ్లు తదితర పథకాలతో రాష్ట్రం ఎక్కువ లబ్ధి పొందిందన్నారు. కాకినాడ పోర్ట్‌లో రూ.4,500కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అమిత్ షా తెలిపారు.