MP Raghurama Krishnamraj FIRs updates: 'తనపై ఉన్న కేసు వివరాలను, ఫిర్యాదుల సమాచారాన్ని ఇవ్వాలి' అని ఎంపీ రఘురామ కృష్ణరాజు గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్‌పై నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ జరిపింది. ఎంపీ రఘురామ కృష్ణరాజుపై 11 ఎఫ్‌ఐఆర్‌లు ఉన్నాయని హోం శాఖ తరపు న్యాయవాది మహేశ్వర రెడ్డి కోర్టుకు తెలియజేశారు. దీంతో ఎంపీ రఘురామ కృష్ణరాజుపై ఉన్న ఫిర్యాదుల వివరాలను తమకు ఇవ్వాలని రఘురామరాజు తరపు న్యాయవాది ఉమేష్ చంద్ర కోరారు.
అనంతరం ఫిర్యాదుల కాపీలను ఇవ్వకపోవడం వెనుక ప్రభుత్వ ఉద్దేశం ఏమిటో తెలిసిపోతుందని ఉమేష్ చంద్ర అన్నారు. దానికి ఆర్‌టీఐ ద్వారా సమాచారం తీసుకోవచ్చు కదా అని పిటిషనర్ న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. ఆర్‌టీఐ ద్వారా వ్యక్తిగత సమాచారం అడగలేమని న్యాయవాది ఉమేష్ చంద్ర వివరించారు. దీంతో ఎఫ్‌ఐఆర్ వివరాలతో పాటు, రిజిస్టర్ కాని ఫిర్యాదులను ఎందుకు ఇవ్వకూడదో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను 10 రోజులకు వాయిదా వేసింది.
తమను, తమ సహచర ఎమ్మెల్యేలను ఎంపీ రఘురామ కృష్ణరాజు కించపరిచేలా మాట్లాడారని, తమ పార్టీలో వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టేలా, శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా చేశారని.. పోడూరు పోలీసు స్టేషన్‌లో మంత్రి శ్రీరంగనాథరాజు, భీమవరం పోలీసు స్టేషన్‌లో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ రఘురామ కృష్ణరాజుపై 2020 జులై నెలలో ఫిర్యాదులు చేశారు. దాంతో తనపై వివిధ పోలీస్ స్టేషన్లలో దాఖలయిన కేసులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ముందస్తు ఆదేశాలు ఇవ్వాలని రఘురామ కృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించి.. రెండు క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం గతంలో వాయిదా వేసింది. ఆ పిటిషన్‌పై ఈరోజు మరోమారు విచారించింది. వాదోపవాదాలు విన్న తర్వాత మరో 10 రోజులకు వాయిదా వేసింది.
ఇవీ చదవండి