చిత్తూరు జిల్లా పీలేరులో వైకాపా నాయకులు నిర్వహించిన కార్యక్రమం విమర్శలకు దారి తీసింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా.. పీలేరు మార్కెట్ కమిటీ ఛైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఆర్భాటంగా నిర్వహించారు. కరోనా వైరస్ వ్యాప్తితో..కేంద్ర ప్రభుత్వం ఆంక్షలపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా వాటిని బేఖాతరు చేస్తూ స్థానిక వైకాపా నాయకులు హడావుడి సృష్టించారు.
పట్టణమంతా ఫ్లెక్సీలు బ్యానర్లు... బాణాసంచాతో హోరెత్తించిన వైకాపా నాయకులు... పెద్ద మొత్తంలో గుంపులుగుంపులుగా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పీలేరు శాసనసభ్యుడు.. చింతల రామచంద్రారెడ్డి సైతం హాజరై ప్రమాణ స్వీకారం చేసిన ఛైర్మన్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, నూతన ఛైర్మన్ ను సత్కరించేందుకు వైకాపా నాయకులు పెద్ద ఎత్తున పోటీపడ్డారు.
కరోనా ఆంక్షలు అమలులో ఉన్నా... వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా వైకాపా నాయకులు వ్యవహరించినా... పోలీసులు మాత్రం మిన్నకుండిపోవటం పలు విమర్శలకు దారి తీస్తోంది.
ఇదీ చదవండి: ప్రత్యేక హోదా వస్తుందన్న నమ్మకం లేదు: పిల్లి సుభాష్ చంద్రబోస్