YSRCP Discrimination on SC and ST MLAs : వైఎస్సార్సీపీ తరపున గెలిచిన దళిత నియోజకవర్గాల్లో అగ్రవర్ణ నేతల పెత్తనంపై ఏకంగా ఉపముఖ్యమంత్రితో పాటు ఎమ్మెల్యేలే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు స్థానాల్లోని ఎమ్మెల్యేలంతా ఎవరో ఒకరి పెత్తనం కిందే పని చేయాల్సిన పరిస్థితి నెలకొంది. రాజకీయంగా వారు మనుగడ సాగించాలంటే పెత్తందారుల అడుగులకు మడుగులు ఒత్తాల్సిందే. వారు చెప్పినట్లుగా నడుచుకుంటేనే టికెట్లు దక్కుతాయి. బద్వేలు, మడకశిర, పూతలపట్టు, సత్యవేడు, నందికొట్కూరు, కోడుమూరు, గూడూరు, సూళ్లూరుపేట, సంతనూతలపాడు ఇలా రిజర్వుడు స్థానాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీకి టికెట్లు రావాలన్నా సిటింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ పోటీకి అవకాశం దక్కాలన్నా పెత్తందారు సిఫార్సు తప్పనిసరి.
దళిత నేతలు ఆవేదన : మంత్రితో పాటు తన నియోజకవర్గంలోని రెడ్డిగారు చెప్పినట్లే అన్నీ చేశానని ఇప్పుడు మాత్రం తనదే తప్పు అంటున్నారని పూతలపట్టు ఎమ్మెల్యే బాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమతోపాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలో పెద్దరెడ్ల దయాదాక్షిణ్యాల మీదే వైఎస్సార్సీపీలో దళితులకు టిక్కెట్లు కేటాయించే పరిస్థితి ఉంది. దళితులుగా పుట్టడం మేం చేసిన నేరమా అంటూ సాక్షత్తు ఎమ్మెల్యేలే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా ఎస్సీలు అంటూ సీఎం జగన్ మాటలు చెప్పడమే తప్ప దళితులకు ఏం న్యాయం చేశారని వారు ప్రశ్నిస్తున్నారు. స్వతంత్రంగా పని చేయాలంటే అధికారాన్నివ్వాలి కదా అంటున్నారు. ఈ అయిదేళ్లు రెడ్డిగార్లు ఏం చెబితే అదే చేశాం కానీ ఇప్పుడు తప్పంతా తమదే అన్నట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ ఉంది కాబట్టి కనీసం ఎమ్మెల్యే టిక్కెట్లు కేటాయిస్తున్నారు కానీ లేకపోతే ఇచ్చేవారు కాదని దళిత నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దళితులంటే చిన్న చూపు - సీఎం జగన్‌పై మరో ఎమ్మెల్యే తిరుగుబాటు
దేవుడి దర్శనమైనా దొరుకుతుంది కానీ జగన్ దర్శనం దొరకదు : పూతలపట్టు నియోజకవర్గంలో ఇప్పుడు బాబులాగే 2019లో అప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్‌కు అన్యాయం చేశారు. టీడీపీ నేతలకు అమ్ముడుపోయారంటూ ఆయనపై నిందమోపి టికెట్ నిలిపివేశారు. ఈ అవమానాన్ని భరించలేకపోతున్నాను అందువల్లే ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నా అని సునీల్ విడుదల చేసిన సెల్ఫీ వీడియో అప్పట్లో సంచలనమైంది. అప్పట్లో ఆయన జగన్‌ను కలిసేందుకు లోటస్‌పాండ్‌కు వెళ్లి మూడు నాలుగు రోజులు వేచి చూసినా దర్శనభాగ్యం కలగలేదు. కాన్వాయ్ ముందుకు వెళితే భద్రతా సిబ్బంది పక్కకు నెట్టేశారు. జగన్ మాత్రం ఆయన్ను పట్టించుకోలేదు.
వైఎస్సార్సీపీ రెడ్లపార్టీ : చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పిందే వేదం. తన ఇలాకాలోని ఎస్సీ రిజర్వుడు స్థానాలైన గంగాధర నెల్లూరు, పూతలపట్టు, సత్యవేడులో ఎమ్మెల్యే అభ్యర్థులెవరనేదీ ఆయనే నిర్ణయిస్తారు. గెలిచిన వారు ఏమి చేయాలనేదీ ఆయనే నిర్దేశిస్తారు. వైఎస్సార్సీపీ రెడ్లపార్టీఅని రిజర్వేషన్ లేకపోతే తనకు టికెట్ కూడా రాదని ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి బహిరంగంగా మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే ఏ స్థాయిలో ఆయన అవమానాలకు గురై ఉంటారో అర్థమవుతుంది. నారాయణస్వామి తన నియోజకవర్గంలో స్వేచ్ఛగా కూడా తిరగలేరు. ఆయన ఏ కార్యక్రమం చేపట్టాలన్నా జిల్లాలోని 'పెద్ద'రెడ్డితో పాటు నియోజకవర్గంలోని రెడ్డి నాయకుల అనుమతీ కావాల్సిందే. లేదంటే అవమానాలకు గురికాక తప్పదు.
27 మందితో వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల రెండో జాబితా విడుదల