లాక్ డౌన్‌తో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్ల వద్ద ఉండే యాచకులు, గమ్య స్థానాలకు చేర లేక చిక్కుకుపోయిన వారి ఆకలిని విశాఖలో కొంత మంది యువత తీరుస్తున్నారు. జనతా కర్ఫ్యూ మొదలైన నాటి నుంచి ప్రతి రోజు ఆహార పొట్లాలను పంచుతున్నారు. ఆహారాన్ని పంపిణీ చేసే సమయంలో చేతులకు గ్లౌజులతో పాటు మాస్కులను ధరించి జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండాలని వారికి సూచిస్తున్నారు. ఆహార పొట్లాలు తీసుకోవడానికి వచ్చే వారు విధిగా వ్యక్తిగత దూరంతో క్యూలో నిలబడాలని చెబుతున్నారు. ఊహించని పరిస్థితి మధ్య ఆకలితో అల్లాడుతున్న వారికి ఈ యువ బృందం సాయం అందిస్తోంది.
రోగులను ఆదుకుంటున్న అమ్మఒడి ఛారిటబుల్ ట్రస్ట్..
తిరుపతిలోని రుయా, ప్రసూతి ఆసుపత్రిలోని రోగుల సహాయకులకు అమ్మ ఒడి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. కరోనా వైరస్ ప్రభావంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో144 సెక్షన్ అమలులోకి వచ్చిన కారణంగా.. తిరుపతిలోని అన్ని దుకాణాలు, హోటళ్లు మూతపడ్డాయి. హోటళ్లు అందుబాటులో లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్పందించిన అమ్మఒడి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు గోపాల్ తన వంతు బాధ్యతగా అన్నదానం చేసి రోగుల సహాయకులను ఆదుకున్నారు.
అనాథలకు ఆప్తుడు... ఈ సబ్ ఇన్స్పెక్టర్
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు పోలీసులు తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ అలసట, విసుగు చెందకుండా మరో ప్రక్క సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో సబ్ ఇన్స్పెక్టర్ సమందర్ వలీ అనాథలకు పండ్లు పంపిణీ చేస్తూ తన దాతృత్వాన్ని చాటుతున్నారు. ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు.
ఇవీ చదవండి: