Upper Caste Leaders Domination in SC MLAs Constituencies: పేరుకే ఎస్సీ ఎమ్మెల్యేలు.. నియోజకవర్గాల్లో పెత్తనం అంతా పెద్దలదే. రాయలసీమలో తొమ్మిదిలో ఏడింట వారిదే రాజ్యమే.. ఇతర ఎస్సీ నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలపై ఇతర వర్గాల నేతలు పెత్తనం సాగిస్తున్నారు. ఓ ఎమ్మెల్యే ఎన్నికైన ఆరు నెలలకే ఈ పదవి వద్దనే స్థాయికి తెచ్చారు..! మరో ఎస్సీ ఎమ్మెల్యే సభా వేదికనే పీకేయించేశారు. ఇలా ఎస్సీ ఎమ్మెల్యేలను దాదాపు జీరోలను చేసేశారు. నా ఎస్సీ.. నా ఎస్సీ.. అంటోన్న సీఎం జగన్ .. ఎమ్మెల్యేలకు అధికారాలు కట్టబెట్టడంలో మాత్రం విఫలమయ్యారు. ఏ సభ జరిగిన తరచూ జగన్ చెప్పే మాట.. పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధం అని. కానీ వాస్తవానికి వైసీపీ ప్రభుత్వంలోనే పెత్తందారీ వ్యవస్థ నడుస్తోంది. ఎన్నికైన ఎస్సీ ప్రజాప్రతినిధులకే ఆయా నియోజకవర్గాల్లో విలువ లేకుండా చేస్తున్నారు.
అక్కడంతా పెద్దిరెడ్డి పెత్తనమే..: ఉమ్మడి చిత్తూరులో జిల్లాలోని సత్యవేడు, గంగాధర నెల్లూరు, పూతలపట్టు మూడు ఎస్సీ నియోజకవర్గాల్లోనూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి నిర్ణయమే ఫైనల్. ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేసేది ఆయనే. ఎమ్మెల్యేలుగా గెలిచినవారూ పెద్దిరెడ్డి మాట జవదాటరాదంతే. పూతలపట్టులో 2014లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన సునీల్‌కుమార్‌కి 2019లో టికెట్ లేకుండా పోవడం పెద్దిరెడ్డి పెత్తనానికి పరాకాష్ట.
రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయినా..?: నారాయణస్వామి రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ తన నియోజకవర్గం గంగాధర నెల్లూరులో ఆయన మంత్రి పెద్దిరెడ్డి తర్వాతనే. మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రభుత్వ ఎన్నారై వ్యవహారాల సలహాదారు జ్ఞానేంద్ర రెడ్డి ఆధిపత్యం కూడా ఇక్కడ కొనసాగుతోంది. పెనుమూరు మండల వైసీపీ అధ్యక్షుడు జ్ఞానేంద్ర రెడ్డి బంధువైన సురేష్‌రెడ్డిని కాదని, విజయకుమార్ రెడ్డిని నారాయణస్వామి నియమించడం జ్ఞానేంద్ర రెడ్డికి నచ్చలేదు. నారాయణస్వామిని వ్యతిరేకిస్తున్న వారందరితో జ్ఞానేంద్ర రెడ్డి పెనుమూరు మండలం పులిగుండులో ఇటీవల బహిరంగ సభను నిర్వహించారు. నారాయణస్వామి నేరుగా ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి తన సమస్యలను చెబుతున్నందున ఈ సారి ఆయన్ను పక్కనపెట్టేసే ప్రయత్నాలు సాగుతున్నాయంటున్నారు.
సత్యవేడులో..: సత్యవేడులో ఎమ్మెల్యే ఆదిమూలం రాజకీయంగా ఏ నియామకాలనైనా మంత్రి పెద్దిరెడ్డి దృష్టికి తీసుకువెళ్లాల్సిందే. వరదాయపాలెం ఎస్సైగా ఉన్న నాగార్జున రెడ్డిపై ఆరోపణలొచ్చాయని గత డిసెంబరులో ఎమ్మెల్యే బదిలీ చేయించారు. ఆ స్థానంలో హనుమంతప్పను నియమించారు. అయితే నాగార్జున రెడ్డి.. పెద్దిరెడ్డిని కలిసి తాను వరదాయపాలెంలోనే చేస్తానని అడిగారు. అంతే సరిగ్గా మూడు నెలల్లోపే ఆ ఎస్సై వరదాయపాలెంకు వచ్చేశారు. అదీ పెద్దిరెడ్డి అంటే.
పూతలపట్టులో.. ఎమ్మెల్యేగా ఎమ్మెస్ బాబు ఉన్నప్పటికీ నియోజకవరంలో ఏ పని కావాలన్నా సరే పెద్దిరెడ్డి దగరకే వెళ్లాలి. ఎమ్మెల్యే అయినా ఆయన వద్దకు వెళ్లాల్సిందే. నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఏ పని మొదలు పెట్టాలన్నా మంత్రి ఆమోదం తప్పనిసరి. అధికారులు కూడా MLA కాదు పెద్దిరెడ్డి చెప్పిన మేరకే పని చేస్తారు. ఏ నామినేటెడ్ పదవినివ్వాలన్నా మంత్రి ఆమోద ముద్ర పడాల్సిందే.
విసిగిపోయిన ఎమ్మెల్యే: నంద్యాల జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్.. ఎమ్మెల్యేగా గెలిచిన ఆర్నెళ్లకే రాజీనామా చేసి వెళ్లిపోదామనే స్థాయిలో విసిగిపోయారు. నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జి, శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆధిపత్యం కొనసాగిస్తుండడంతో ఇబ్బంది పడుతున్నట్లు ఎమ్మెల్యే పలుమార్లు ఆవేదనను వ్యక్తం చేసిన పరిస్థితి. నందికొట్కూరు మున్సిపాలిటీలో 29 వార్డుల్లో ఎమ్మెల్యే పార్టీ అభ్యర్థులతో నామినేషన్ వేయించారు. అయితే ఆయనకు సంబంధించిన 9మందికే పార్టీ బి ఫారాలు ఇచ్చింది. మిగిలిన 20ని సిద్ధార్థ రెడ్డి వర్గీయులకు పార్టీ ఇచ్చింది.
ఎమ్మెల్యే చేసేది లేక తాను నామినేషన్లు వేయించినవారిలో 20 మందితో ఉపసంహరింపజేయించారు. ఎమ్మెల్యేకు ఇచ్చిన 9లోనూ అయిదుగురిని బైరెడ్డి సిద్దార్థరెడ్డి తన గ్రూప్‌లోకి తీసుకున్నారు. గతంలో నియోజకవర్గంలో కొన్ని అభివృద్ధి ప్రారంభ కార్యక్రమానికి నాటి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అనిల్ రాగా బైరెడ్డి ఆధ్వర్యంలోనే కార్యక్రమాలన్నీ జరిగాయి. తాజాగా ఇండోర్‌స్టేడియం ప్రారంభానికి క్రీడాశాఖ మంత్రి రోజా వచ్చినపుడు కూడా ఎమ్మెల్యేకి కనీసం ఆహ్వానమూ లేదు.
ఎమ్మెల్యే సభావేదికనూ తొలగించారు..!: కర్నూలు జిల్లా కోడుమూరులో ఎమ్మెల్యేగా డాక్టర్ సుధాకర్ ఉన్నా పెత్తనం మాత్రం నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జి, కుడా ఛైర్మన్ కోట్ల హర్షవర్దన్ రెడ్డిదే. హర్షవర్దన్ స్వగ్రామంలో ఎమ్మెల్యే సమావేశం పెడితే తమ ప్రాంతంలోకి ఎలా వస్తారంటూ సభావేదికనూ వైసీపీ నేతలే తొలగించారు. గూడూరు ఎంపీపీగా రాజమ్మను ఎమ్మెల్యే ప్రతిపాదిస్తే.. సునీతకు ఆ పదవిని ఇప్పించుకుని హర్షవర్దన్ రెడ్డి తన ఆధిపత్యం చాటుకున్నారు.
బద్వేలు.. అంటే గోవింద రెడ్డి.. గోవిందరెడ్డి అంటే బద్వేలు ఇదీ ఇప్పుడక్కడున్న పరిస్థితి. ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపిక నుంచి నియోజకవరంలో అన్ని వ్యవహారాల పర్యవేక్షణంతా గోవింద రెడ్డిదే. నియోజకవర వైసీపీ ఇన్‌ఛార్జిగా ఆయన చెప్పినట్లే ఇక్కడ జరగాలి. 2014లో మన్సిపల్ కమిషనర్ జయరాములును, 2019లో వెంకటసుబ్బయ్యను తీసుకువచ్చి టికెట్ ఇప్పించి గెలిపించారాయన. వెంకటసుబ్బయ్య మృతి చెందగా.. సుధను అభ్యర్థిగా ఖరారు చేసింది కూడా గోవిందరెడ్డే. సుధ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ నియోజవకర్గంలో గోవిందరెడ్డి మాటే ఫైనల్.
సంతనూతలపాడు: ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలోని చీమకుర్తి మండలంలో మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద రెడ్డి, సంతనూతలపాడులో మండల వైసీపీ సమన్వయకర్త దుంపా చెవిరెడ్డిల హవా నడుస్తోంది. మండల పరిషత్ పనుల పంపిణీ నుంచి అన్ని వ్యవహారాలూ వీరి ద్వారానే జరగాలి. ఈ వ్యవహారాల్లో ఎమ్మెల్యే సుధాకర్ బాబు స్వయంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉండదు. మరోవైపు నియోజకవర్గం పూర్తిగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి నియంత్రణలో ఉండడంతో స్థానికంగా అగ్ర వర్ణాలకు చెందిన నేతలు.. తమకు ఎమ్మెల్యేతో ఏ చిన్న బేధాభిప్రాయం వచ్చినా బాలినేని వద్ద వాలుతున్నారు.
రాజాంలో పాలవలస పాగా: విజయనగరం జిల్లాలోని రాజాంలో పాలవలస కుటుంబం పాలనే ఉంటుంది. స్థానిక పదవుల్లో నియామకాలు, అధికారులను ఎవరిని ఇక్కడ నియమించుకోవాలి? ఎవరిని బదలీ చేయించాలి లాంటి ఏ వ్యవహారంలోనూ ఎమ్మెల్యే కల్పించుకునే పరిస్థితే లేదు. ఎవరైనా ఎమ్మెల్యే వద్దకు వచ్చి పని అడిగినా, పదవి అడిగినా ఆయన ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ వద్దకు పంపాల్సిందే. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచన కంబాల జోగులు పరిస్థితి ఇది.
ఎమ్మెల్యేను మారుద్దామనడంతో..: అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు వ్యతిరేకంగా ఎస్.రాయవరంలో బొలిశెట్టి గోవిందరావు, నక్కపల్లిలో వీసం రామకృష్ణ, పాయకరావుపేటలో చిక్కాల రామారావు, కోటవరుట్లలో మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణ రాజు కార్యకలాపాలు సాగించేవారు. గతేడాది సెప్టెంబరులో ఎమ్మెల్యే పర్యటనకు వెళితే గుడివాడలో అడ్డుకున్నారు. ఎస్సీ ఎమ్మెల్యే కాబట్టే అవమానిస్తారా అంటూ దళిత సంఘాలు అప్పట్లో ధర్నాలు చేయాల్సి వచ్చింది. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేని మార్చి మరొకరికి టికెట్ ఇస్తాం, అప్పటివరకూ సర్దుకుపోండి అని వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త ఒకరు హామీనివ్వడంతో బాబూరావును వ్యతిరేకించిన ఇతర వరాల నేతలు కొంత తగారు.
గూడూరులో..: గూడూరు నియోజకవరంలో ఎమ్మెల్యే వరప్రసాద్‌కు పోటీగా వైసీపీ కీలక నేతలు నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, ఎల్లసిరి గోపాలరెడ్డి, పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డిలు వ్యవహరిస్తున్నారు. నియోజకవరంలో వారి పెత్తనాన్ని కొనసాగిస్తున్నారు. ఎస్సీ ఎమ్మెల్యేల్లో కొందరు వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్ వస్తుందో రాదో అనే ఉద్ధేశ్యంతో ఇప్పుడు నియోజకవర్గంలో ఇతర వర్గాల పెత్తనాన్ని భరిస్తూనే వారు చెప్పినవారికే పదవులు ఇవ్వడం, అధికారులకు పోస్టింగ్ ఇవ్వడం వంటివాటికి మద్దతునిస్తూ తద్వారా ఎంతో కొంత లబ్దిపొందుతున్నారు.