పోలీసుల కథనం ప్రకారం.. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం 102-ఈ రామిరెడ్డిగారిపల్లెకు చెందిన ఓ వివాహితకు ఇదే పంచాయతీ పరిధిలోని చిగురుమాకులపల్లెకు చెందిన తన భర్త స్నేహితుడు, ఆటోడ్రైవర్ ఉదయకుమార్‌తో సాన్నిహిత్యం ఏర్పడింది. ఆమెకు పది నెలల పసిప్రాయమున్న కవలలు పునర్వి, పునీత్‌లు ఉన్నారు. సోమవారం అర్ధరాత్రి తన వెంట రావాలని, లేకుంటే చనిపోతానని ఉదయకుమార్ బెదిరించడంతో ఆమె తన ఇద్దరు పిల్లలతో ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఆటోలో బయలుదేరిన వారు సదుం మండలం చింతపర్తివారిపల్లె గ్రామ సమీపంలోని నడిమిఒడ్డుకుంట వద్దకు చేరుకున్నారు.
చిన్నారిలిద్దరినీ అతడు చెరువులో పడేశాడు. తరవాత వారిద్దరూ పురుగుల మందు తాగారు. చిన్నారులు నీటికుంటలో తేలుతూ ఉండటాన్ని మంగళవారం ఉదయం పొలాల వద్దకు వచ్చిన ఓ రైతు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. పరిసర ప్రాంతాల్లో వెదకగా అపస్మారకంగా పడి ఉన్న వివాహిత, ఉదయకుమార్ కనిపించారు. వారిని పీలేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తన భార్యను ఉదయకుమార్ వేధించేవాడని, పిల్లలను అతడు నీటికుంటలో పడేయడంతో చనిపోయారని ఆమె భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై హత్య కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: ఎముకలు కొరికే చలిలోనూ యుద్ధానికి సంసిద్ధం!