తిరుమల అన్నమయ్య భవనంలో తితిదే ఛైర్మన్ వై.వీ.సుబ్బారెడ్డి అధ్యక్షతన ఇవాళ ధర్మకర్తల మండలి సమావేశం జరగనుంది. పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. విశేషపూజ, వసంతోత్సవం వంటి ఆర్జిత సేవలను నిలిపివేసే అంశంతో పాటు తిరుపతిలో నిర్మిస్తోన్న గరుడవారధికి నిధుల కేటాయింపు... నిరుపేద పిల్లలకు ఎడ్యుకేషన్ ఎక్సలెన్సీ పేరుతో విద్యాసంస్థ ఏర్పాటుపై చర్చించనున్నారు.
ఆగమ సలహా సిఫారసుపై....
నిత్యాభిషేకాలతో శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్ప స్వామి విగ్రహం క్షీణ దశకు చేరుతోందని... ఆర్జిత సేవలను కొన్నింటిని రద్దు చేయాలని అర్చకులు, ఆగమ సలహా మండలి సభ్యులు ధర్మకర్తల మండలికి సిఫారసు చేశారు. దీనిపైనా సమావేశంలో చర్చించనున్నారు. తితిదే నిఘా, భద్రతా విభాగంలో సెక్యూరిటీ గార్డులు నియామకం, కనుమ రహదారుల మరమ్మతుల కోసం రూ.90 కోట్లు, తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనంలో మరమ్మతుల కోసం రూ.14.5 కోట్ల కేటాయింపుపై నిర్ణయం తీసుకోనున్నారు.
ముంబయి శ్రీ వారి ఆలయ నిర్మాణంపై....
ఎస్పీఎఫ్ పోలీసుల జీతాల కోసం ప్రభుత్వానికి చెల్లించవలసిన రూ.70 కోట్ల నిలిపివేత, కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయ బంగారు రథం తయారీ అనుమతులు, తితిదేలో గణాంక విభాగం ఏర్పాటు... ముంబయిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి అనుమతులపై సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల వసతి సముదాయాలను అలిపిరి సమీపంలో నిర్మించే అంశంపైనా చర్చ జరగనుంది.
ఇవీ చూడండి: