తిరుపతి ఉపఎన్నికకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. నెల్లూరు జిల్లా సర్వేపల్లి, సూళ్లూరుపేట నియోజకవర్గాల్లో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆ పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మి తరఫున ప్రచారం చేస్తున్నారు. ముత్తుకూరు, నాయుడుపేట మండలాల్లో పాదయాత్రతో... తెలుగు తమ్ముళ్లలో జోష్ నింపారు. గూడూరు నియోజకవర్గంలో అమర్‌నాథ్‌రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు.
రాపూరు మండలంలో వైకాపా అభ్యర్ధి గురుమూర్తి తరఫున ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు బాలినేని , అనిల్ కుమార్‌యాదవ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రచారం నిర్వహించారు. గూడూరు, సైదాపురం, వెంకటగిరి ప్రాంతాల్లో పర్యటిస్తూ వైకాపా నేతలు ఓట్లు అభ్యర్థించారు. కోట, చిట్టమూరు, నాయుడుపేట, దొరవారిసత్రం, సూళ్లూరుపేట మండలాల్లో భాజపా అభ్యర్ధి రత్నప్రభ ర్యాలీలు నిర్వహించారు.
తిరుపతి నెహ్రూనగర్‌లో భాజపా - జనసేన నాయకులు సంయుక్తంగా ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌తో పాటు జనసేన నేతలు ఇంటింటికీ తిరుగుతూ రత్నప్రభకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. బంధువులు,అనుచరులకు రాష్ట్ర సంపదను దోచిపెట్టేందుకు సీఎం జగన్ మార్గాలు వెతుకుతున్నారని భాజపా నేతలు విమర్శించారు. నకిలీ ఓటరు కార్డులను సృష్టించి అత్యధిక మెజారిటీ సాధించాలని చూస్తున్నారని ఆరోపించారు. సీపీఎం అభ్యర్ధి యాదగిరి తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికీ వెళ్తూ తమ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు.