తిరుచానూరు వ్యవసాయ మార్కెట్ యార్డు సొంతంగా ఆదాయ వనరులు సమకూర్చుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మార్కెట్ యార్డుకు గతంలో ఏడాదికి వివిధ పన్నుల రూపంలో దాదాపు రూ.3 కోట్ల వరకు ఆదాయం వచ్చేది. అయితే గత మూడు నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం దేశం అంతటా ఒకే పన్ను విధానం అమలు చేయడంతో యార్డుకు శిస్తు రూపంలో వచ్చే ఆదాయాన్ని పూర్తిగా కోల్పోయింది. ఈ క్రమంలో సొంతంగా ఆదాయాన్ని సమకూర్చుకోవడంపై పాలకమండలి దృష్టి సారించింది. ఇందులో భాగంగా యార్డు ఆవరణలో దాదాపు రూ.5 కోట్ల వ్యయంతో 210 దుకాణాలు నిర్మించేందుకు మాస్టర్‌ప్లాన్ రూపొందించింది. ప్రభుత్వం చేపడుతున్న నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా యార్డులో అభివృద్ధి పనుల మంజూరుకు అధికారుల నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది.
తిరుచానూరు వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో ఇప్పటి వరకు అన్ని రకాల పండ్ల దుకాణాలు, మామిడి మండీలు కలిసి 110 వరకు ఉన్నాయి. కొత్తగా రైతుబజారు కోసం 70 దుకాణాలు, 140 ఇంటిగ్రేటెడ్ భవనాలు నిర్మించనున్నారు. గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తు ఉండేలా నిర్మాణ శైలిలో రూపొందించనున్నారు. రైతుబజారు దుకాణాలు మాత్రం రైతులకు ఉచితంగానే కేటాయించనున్నారు. మిగిలిన దుకాణాలు బహిరంగ వేలం ద్వారా కేటాయించేలా ప్రణాళికలు రూపొందించారు.
వచ్చే ఏడాది చివరికి..
మరో వైపు తుడా సహకారంతో మార్కెట్ యార్డు పరిసర ప్రాంతాల్లో ఆధునీకరణ పనులు చేపట్టనున్నారు. ఈ పనుల ప్రతిపాదనలను ఇటీవల మార్కెటింగ్ కమిటీ ఛైర్‌పర్సన్ వీరపల్లి శ్రీవిద్య అమరావతిలో మార్కెటింగ్ శాఖ కార్యదర్శి ప్రద్యుమ్నను కలిసి అందజేశారు. మార్కెటింగ్‌శాఖ ఇంజినీరింగ్ అధికారులు సైతం పనులకు సంబంధించిన ప్రణాళికలపై స్థానిక అధికారులతో చర్చిస్తున్నారు. వచ్చే ఏడాది చివరి నాటికి పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురానున్నట్లు పాలకమండలి సభ్యులు తెలిపారు.
ప్రభుత్వ అనుమతితో పనులు
మార్కెట్‌యార్డులో చేపట్టనున్న ప్రతిపాదనలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. మార్కెటింగ్‌శాఖ ఉన్నతాధికారులు కూడా పనులు చేపట్టేందుకు సానుకూలం వ్యక్తం చేశారు. 210 దుకాణాల సంబంధించి అనుమతులు మంజూరు చేసిన వెంటనే టెండర్లు ఆహ్వానిస్తాం. - వీరపల్లి శ్రీవిద్య,ఏఎంసీ
ఇదీ చదవండీ...విద్యార్థుల ఎంపికను తాత్కాలికంగా నిలిపేయాలని ప్రభుత్వం ఆదేశం