చిత్తూరు జిల్లా గంగవరం మండలం కలగటూరుకు చెందిన వెంకట రామయ్య ఈనెల 8న తన ఇంటి ముందు పడుకుని ఉండగా.. ఒక ఆవు అతని గుండెలపై కాలితో తొక్కింది. అస్వస్థతకు గురైన తండ్రికి వైద్యం చేయించేందుకు పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లింది అతని కుమార్తె. అతన్ని పరీక్షించిన వైద్యులు స్కానింగ్ చేయాలని.. తమ వద్ద ఆ సౌకర్యం లేదని చెప్పి పంపించేశారు.
అయితే బుధవారం వెంకటరామయ్యకు ఊపిరి తీసుకోవడం కష్టం కావటంతో అతని కుమార్తె ఆటోలో ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవటంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్దామనుకుంటుండగా ఆటోలోనే ఆయన కన్నుమూశారు. ఇది గమనించిన ఆటోడ్రైవర్ మృతదేహాన్ని రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయాడు. కరోనా భయంతో స్థానికులెవరూ ఆమెకు సాయం చేసేందుకు రాలేదు.
తన తండ్రి కరోనాతో చనిపోలేదని, ఆవు తొక్కడం వల్ల మృతిచెందాడని యువతి మొత్తుకుంటున్నా ఎవరూ కనికరించలేదు. తండ్రి మృతదేహం ముందు కూర్చుని ఆర్తనాదాలు చేస్తున్నప్పటికీ ఎవరూ స్పందించలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతుని కుమార్తెను విచారించి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు.
ఇవీ చదవండి...
'దయచేసి నన్ను కాపాడండి’.. కరోనా సోకిన ప్రధానోపాధ్యాయుడి ఆవేదన