కొవిడ్ టీకాలను తొలి విడతలో దేశవ్యాప్తంగా 30కోట్ల మందికి ఇవ్వాలని నిర్ణయించినట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో.. ఇందులో భాగంగా తెలంగాణలో సుమారు 70-75 లక్షల మందికి వ్యాక్సిన్ అందవచ్చని వైద్యవర్గాలు భావిస్తున్నాయి. కరోనా టీకాల సన్నద్ధతపై ప్రధాని మోదీతో సమీక్ష అనంతరం తెలంగాణ ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఏర్పాట్లపై దృష్టిపెట్టారు. కేంద్రం ప్రకటించిన ప్రకారం.. కొవిడ్ టీకా లబ్ధిదారుల్లో 50 ఏళ్లు పైబడినవారే అత్యధికులున్నారు. టీకా ఇచ్చే ప్రతి వ్యక్తికి 2 డోసుల చొప్పున 4 వారాల వ్యవధిలో అందజేస్తారు. ఈ లెక్కన తెలంగాణకు సుమారు కోటిన్నర డోసులు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 30 కోట్ల జనాభాలో..
* కోటి మంది ప్రభుత్వ, ప్రైవేటు ఆరోగ్య సిబ్బంది
* కోటి మంది 50 ఏళ్లలోపు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు
* 2 కోట్ల మంది పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, ముందు వరసలో నిలిచే ఇతర సిబ్బంది
* 26 కోట్ల మంది 50 ఏళ్లు పైబడినవారు
ఈ ప్రాతిపదికనే తెలంగాణలోనూ కొవిడ్ టీకాల అమలు కానున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. ప్రభుత్వ, ప్రైవేటు వైద్యంలో పనిచేస్తున్న సుమారు 3లక్షల మంది వైద్యులు, సిబ్బంది జాబితాను ఇప్పటికే కేంద్రానికి పంపించారు. మిగిలిన విభాగాల్లో తొలివిడత టీకాలు పొందేవారి జాబితా తయారీ సవాల్‌గా మారింది. ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి తొలి ప్రాధాన్యమివ్వాలని భావిస్తున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. టీకాల దుష్ప్రభావాలపై కచ్చిత సమాచారం లేకపోవటంతో ఐదేళ్లలోపు చిన్నారులకు, 75ఏళ్లు పైబడినవారికి ఇచ్చే అవకాశాలు తక్కువనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విషయంలో నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వైద్యవర్గాలు వెల్లడించాయి. తొలివిడతలోనూ అందరికీ ఒకేసారి టీకా ఇవ్వరు. వేర్వేరు విభాగాలు, వయసులు, అనారోగ్య సమస్యల వారీగా ఎంపిక చేస్తారు. వారిలో టీకాలు పొందినవారిని కొద్దిరోజుల పాటు పర్యవేక్షణలో ఉంచుతూ ఎదురయ్యే పరిణామాలను గమనిస్తూ అమలును కొనసాగించనున్నారు.
టీకా ఉచితంగానే
ప్రస్తుత అంచనాల మేరకు కొవిడ్ టీకాను తొలివిడతలో అందరికీ ఉచితంగానే అందజేసే అవకాశాలున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. తర్వాతి దశల్లో టీకా లభ్యత, విజయాల శాతాన్ని బేరీజు వేసుకొని, విపణిలో అందుబాటులోకి తేవడం, టీకాకు నిర్ణీత ధరను నిర్ణయించడం తదితరాలపై దృష్టిపెట్టే అవకాశాలున్నాయి.