LOKESH ON WOMENS DAY : జగన్ పాలనలో మహిళలకు రక్షణ లేదని.. 900 మంది మహిళలపై అత్యాచారాలు జరిగితే 21 రోజుల్లో ఒక్కరికీ న్యాయం చేయలేదని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో 38వ రోజు యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. పాదయాత్ర ప్రారంభానికి ముందు చింతపర్తి విడిది కేంద్రం వద్ద అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మహిళలకు లోకేశ్ పాదాభివందనం చేశారు.
చట్టాల ద్వారా మహిళలకు రక్షణ రాదని.. చిన్న వయస్సు నుంచే మహిళల గౌరవం తెలిసేలా ప్రత్యేక పాఠ్యాంశాలు చేర్చాల్సిన అవసరం ఉందని లోకేశ్ అభిప్రాయపడ్డారు. జగన్ మహిళలను మోసం చేశారని.. దిశ చట్టం లేకుండానే హడావిడి చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం.. జగన్ పాలనలో 52 వేల మంది మహిళలపై వేధింపులు, 900 మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయని తెలిపారు.
ఏనాడూ రాజకీయాల్లో లేని తన తల్లిని అసెంబ్లీ సాక్షిగా వైఎస్సార్సీపీ నాయకులు అవమానించారన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కేజీ నుంచి పీజీ వరకూ మహిళల గొప్పతనం, వారు పడే కష్టాలు తెలిసేలా ప్రత్యేక పాఠ్యాంశాలు పెడతామన్నారు. మహిళా మంత్రులే మహిళల్ని కించ పరిచేలా మాట్లాడుతున్నారన్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం తర్వాతే ఓట్లు అడుగుతానన్న జగన్.. మోసం చేసి ఇప్పుడు ఏకంగా జే బ్రాండ్ లిక్కర్ తయారు చేసి అమ్ముతున్నారని ఆరోపించారు.
"సమాజంలో భయం, భక్తి రెండూ ఉండాలి. గంజాయి స్మగ్లర్స్, నిందితులు, దొంగలకు చంద్రబాబు అంటే భయం. కానీ ఇప్పటి పాలనలో భయం కాదుకదా విచ్చలవిడితనం వచ్చింది. మంత్రి రోజా ఒక సందర్భంలో నాకు చీర, గాజులు పంపిస్తా అన్నది. అంటే చీర, గాజులు వేసుకునే వారు చేతకానీ వాళ్లా అని నేను అడుగుతున్న"-నారా లోకేశ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
మహిళా కార్యకర్తలపై అసభ్యకర పోస్టులు పెడితే తిరగబడాలని లోకేశ్ సూచించారు. మహిళలపై అఘాయిత్యాల నివారణకు చట్టాలతో పాటు చైతన్యం పెరగాలని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో మహిళలపై దాడులు తక్కువగా ఉంటాయని.. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఈశాన్య రాష్ట్రాల్లో పరిశీలించి మన రాష్ట్రంలో అమలు చేస్తామన్నారు. విద్యాదీవెన, వసతి దీవెన పేరుతో రూ.10 వేలు ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారని మండిపడ్డారు.
ప్రభుత్వ తీరుతో పేద విద్యార్థులు అప్పుల పాలవుతున్నారని ఆగ్రహించారు. విదేశీ విద్య పథకం పూర్తిగా నిలిపివేశారని.. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లి అప్పుల పాలవుతున్నారన్నారు. తల్లి, చెల్లిని గౌరవించలేని వ్యక్తి మహిళలను గౌరవించలేరని దుయ్యబట్టారు. అమరావతి ఉద్యమంలో మహిళలపై దాడులు చేశారని.. మహిళల బాధలు పోవాలంటే బాబు రావాలని సూచించారు. కులం, మతం, ప్రాంతం, పార్టీల పేరుతో జగన్ రాష్ట్రాన్ని నిలువునా చీల్చారని ధ్వజమెత్తారు.
ఇవీ చదవండి: