environmental protection: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురానికి చెందిన సుహాసిత్ బీటెక్ చదువుకున్నారు. పొరుగు ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగం చేయడం ఇష్టం లేక స్వయం ఉపాధి పొందాలనుకున్నారు. అదేవిధంగా ప్రకృతి ప్రేమికుడు కావడంతో మితిమీరిన ప్లాస్టిక్ వినియోగాన్ని కొంతైనా తగ్గించాలనే ఉద్దేశంతో తన ఆలోచనలకు పదును పెట్టారు. మట్టి వస్తువులకు ఆదరణ పెరుగుతుండటంతో.. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా వివిధ ఆకృతుల్లో ప్రమిదలు, కుండలు, అలంకరణ వస్తువులు, కళాకృతుల తయారీపై దృష్టి సారించారు. కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసి మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. పర్యావరణాన్ని కాపాడే విధంగా ఏదైనా చేయాలనుకున్నారు. తన ఆలోచనలకు పదునుపెట్టి మట్టి వస్తువుల తయారీకి నడుం బిగించారు.
తండ్రి సహకారంతో 2018లో కుటీర పరిశ్రమ ఏర్పాటు చేశారు. మట్టి వస్తువులకు అవసరమైన యంత్రాలను స్వయంగా తానే తయారు చేసి ఉత్పత్తిని ప్రారంభించి విక్రయించేవారు. అమ్మకాలు ఆశాజనకంగా ఉండడంతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించారు. రూ.15 లక్షల పెట్టుబడి పెట్టి... కిలణ్ మిషన్‌ను తయారు చేశారు. వినియోగదారుల ఆసక్తికి అనుగుణంగా రకరకాల ప్రమిదలు, కుండలు, అలంకరణ వస్తువులు తయారు చేస్తూ లాభాలు పొందుతున్నారు.
మట్టి కళాకృతులకు విశేష ఆదరణ లభించడంతో రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ఉత్పత్తిని పెంచాలనే లక్ష్యంతో అదే గ్రామంలో మహిళలకు పని నేర్పించి ఉపాధి కల్పించారు. మట్టి వస్తువులు పర్యావరణహితం కావడంతో మరింత గిరాకీ పెరిగింది. వీటి ఉత్పత్తికి మరిన్ని యంత్రాలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని యువకుడు కోరుతున్నారు.
ఇదీ చదవండి: