Students Suffering Due to Lack of Classrooms: నాడు-నేడు పనుల జాప్యం.. విద్యార్థులకు శాపంగా మారింది. పిల్లలకు తరగతి గదులు లేక చెట్ల కింద చదువుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. పాఠశాల నిర్మాణం పనులు ఇంకా పునాది దశలోనే మూలుగుతుండటంతో.. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వీటితో పాటు వర్షాలు, ఎండలు వారి చదువులకు అడ్డుగోడలుగా మారుతున్నాయి. దీంతో ప్రభుత్వం త్వరితగతిన పాఠశాల భవన నిర్మాణం పూర్తి చేయాలని.. చిత్తూరు జిల్లా మూలతిమ్మేపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులు వేడుకుంటున్నారు.
చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం మూలతిమ్మేపల్లి గ్రామంలోని.. ఉన్నత పాఠశాలలో సుమారు 200 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో మూడు గదులు ఉన్నాయి. అందులో రెండు గదులు.. ఆఫీస్, స్టోరేజ్ రూంలకు పోగా.. మిగిలిన ఒక్క గదిలో పదో తరగతి విద్యార్థులకు పాఠాలు జరుగుతున్నాయి. మిగిలిన ఆరు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులు ఆరుబయట చెట్ల కింద కూర్చుని విద్యను అభ్యసిస్తున్నారు.
ఇక వర్షాకాలం వచ్చిందంటే స్కూల్ మూతవేయాల్సిందే..! గదుల కోరతతో.. సరిగ్గా సిలబస్ పూర్తికాక చదువులో వెనకపడిపోతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. చెట్ల కింద కూర్చుని చదువుకోవడం కూడా ఇబ్బందిగా ఉందని అంటున్నారు. చెట్లపై నుంచి విష పురుగులు పడుతున్నాయని.. అలానే పాములు కూడా వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతేడాది సెప్టెంబర్ నెలలో నాడు-నేడు రెండో దశ పనుల కింద.. ఈ పాఠశాలకు 8 గదులు మంజూరయ్యాయి. కానీ.. నెలలు గడుస్తున్నా నిర్మాణం పనులు మాత్రం ఇంకా పునాదుల వరకే పరిమితమయ్యాయి. బైరెడ్డిపల్లికు చెందిన వైసీపీ నేత ఈ భవన నిర్మాణాల పనులకు కాంట్రాక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. కోటీ 4లక్షల రూపాయల నిధులతో ప్రారంభమైన ఈ 8 గదుల నిర్మాణం.. బిల్లుల జాప్యంతో ముందుకు సాగడంలేదు. విద్యా కమిటీ సభ్యులు కూడా డబ్బులు పెట్టలేక చేతులెత్తేస్తున్నారు. ఫలితంగా విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
గదుల కొరతతో విద్యార్థుల తల్లిదండ్రులు సైతం అప్పులు చేసి మరీ.. తమ పిల్లలను ప్రైవేటు పాఠశాల వైపు మళ్లిస్తున్నారు. దీంతో పేదపిల్లలకు చదువు భారంగా మారింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి వేగంగా భవన నిర్మాణం పూర్తి చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.
"మా పాఠశాలలో తరగతి గదుల కొరత వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. చెట్టు కింద కూర్చుని చదవాల్సిన దుస్థితి ఏర్పడింది. వర్షం, ఎండల కారణంగా మేము చెట్టు కింద కూడా కూర్చుని చదవలేకపోతున్నాము. చెట్లపై నుంచి పాములు కూడా పడుతున్నాయి. దయచేసి తొందరగా నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా మా పాఠశాల తరగతి గదుల నిర్మాణం పూర్తి చేయాలని కోరుతున్నాము." -విద్యార్థులు
ఇవీ చదవండి: