తిరుమల... కలియుగ వైకుంఠం.. ఆ వైకుంఠనాథునికి జరిగే ప్రతీ అలంకరణ, ప్రతీ సేవ ప్రత్యేకమే. భక్తులకు నయనానందమే. శ్రీవారికి ఆపాదమస్తకం ఎలాంటి నగలు అలంకరిస్తారు? సుప్రభాతం మొదలు ఏకాంత సేవ వరకూ ఏయే సేవలు నిర్వహిస్తారు? స్వామికి ఎలాంటి సందర్భంలో ఎలాంటి నైవేద్యం సమర్పిస్తారు? ఆ విశిష్టత ఏంటి? అన్న వివరాలపై ఆసక్తి మాత్రమే కాదు... వాటన్నింటిని ఒక్కసారైనా వీక్షించి, తరించాలని శ్రీవారి భక్తుల్లో చాలామంది కోరుకుంటారు. ఇలా భక్తకోటి తెలుసుకోవాలనే సందేహాలను నివృత్తి చేసేందుకు బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం.
అర చేతిలో.. శ్రీవారి సేవల దృశ్యమాలిక
శ్రీవారి చరిత్ర, ఏడుకొండల విశిష్ఠత, స్వామివారి దివ్య స్వరూపం ప్రత్యేకత, మూల మూర్తులు, శ్రీవారి ఆభరణాల విలక్షణత, స్వామి వారి పూజా విధానాల విశేషాలు. ఇవి మాత్రమే కాదు.. తిరుమలకు వచ్చే భక్తుల వసతి సౌకర్యాలు, సేవా వివరాలతో కూడిన.. నలభై సెకండ్లు మొదలు, రెండు నిమిషాల నిడివి గల దృశ్యమాలికను శ్రీవారి భక్తుల చరవాణులకు చేరవేస్తోంది తితిదే.
ఎందుకు...? ఎలా...??
హిందూ ధర్మప్రచారాన్ని విసృతం చేయడంతో పాటు తిరుమల యాత్రను భక్తులకు మరింత సులభతరం చేసే లక్ష్యంతోనే అత్యంత ఆధునిక పరిజ్ఞానాన్ని తితిదే వినియోగిస్తోంది. శ్రీవారి దర్శనంతో పాటు తిరుమల, తిరుపతిలో వసతి సముదాయాల వినియోగం కోసం తితిదే ఇప్పటికే ఆన్‌లైన్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఆన్‌లైన్ యూజర్‌గా పేరు నమోదు చేసుకొన్న భక్తుల చరవాణులకు.. తాజాగా పుష్ నోటిఫికేషన్ పేరుతో చిన్నపాటి దృశ్యమాలికలను పంపే ఏర్పాటును అందుబాటులోకి తెచ్చింది.
రోజుకు 40 వేల మందికి..
సగటున రోజుకు నలభై వేల మంది భక్తులకు తిరుమల యాత్రకు సంబంధించిన వివరాలతో పాటు తితిదే అందిస్తున్న సేవల వివరాలతో కూడిన వీడియోలను పంపుతున్నారు. భవిష్యత్తులో ఆన్‌లైన్ యూజర్లుగా ఉన్న 40 లక్షల మంది భక్తులకు పుష్ నోటిఫికేషన్ ద్వారా మరిన్ని వీడియోలు పంపేలా తితిదే ప్రణాళికలు రూపొందిస్తోంది.