తిరుమలలో అంగరంగ వైభవంగా సాగుతోన్న శ్రీనివాసుని వార్షిక బ్రహ్మోత్సవాలు చివరి దశకు చేరుకున్నాయి. గడచిన ఏడు రోజులుగా వివిధ వాహనాలపై మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయ ప్రధానం చేసిన స్వామివారు ఇవాళ ఉదయం మహారథంపై ఊరేగనున్నారు. రాత్రి జరిగే అశ్వ వాహన సేవతో స్వామి వారి సేవలు పరిసమాప్తం కానున్నాయి.
మహారథంపై స్వామి దర్శనం
రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే... రథంపై విహరించే శ్రీ మహా విష్ణువును దర్శిస్తే పునర్జన్మ ఉండదన్నది పురాణోక్తి. బ్రహ్మోత్సవాల వేళ మాత్రమే ఆవిష్కృతమయ్యే ఈ దృశ్యాలను చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. ఎనిమిదో రోజు బ్రహ్మోత్సవాల్లో ఉదయం మలయప్ప స్వామి మహారథంపై అధిష్ఠించనున్నారు. ధారు రథంపై శ్రీదేవీ, భూదేవి సమేతంగా భక్తులకు వీనుల విందు చేయనున్నారు. వివిధ రకాల వర్ణ వస్త్రాలు, తోరణాలు, శిల్పాలు, పుష్పమాలలు, బంగారు కలశం, బంగారు గొడుగుతో ఈ మహా రథాన్ని అలంకరిస్తారు. ఉభయ దేవేరులతో రథంపై ఊరేగుతోన్న స్వామి, అమ్మవార్లను దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని భక్తులు విశ్వసిస్తారు.
అశ్వవాహనంపై కల్కిగా...
రాత్రికి జరిగే అశ్వవాహన సేవలో కల్కి అవతారంలో స్వామి వారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ వాహనంపై స్వామి వారు క్షత్రియ లక్షణాలు కలిగిన తలపాగా, దూసిన కరవాలంతో, విశేష తిరు ఆభరణాలతో అలంకారమై మాడవీధుల్లో ఊరేగుతారు. కలియుగాంతంలో దుష్టశిక్షణ... శిష్టరక్షణ చేసి ధర్మాన్ని పునఃప్రతిష్ట చేసే కల్కిమూర్తి రూపం నిజంగా అపురూపం. కల్కి అవతారంలో స్వామిని దర్శించుకోవడం వల్ల దుర్గుణాలు పోయి సద్గుణాలు ప్రాప్తిస్తాయని ఆగమ పండితులు చెబుతున్నారు. బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తితిదే ప్రత్యేక చర్యలు చేపట్టింది. బ్రహ్మోత్సవాలలో అశ్వవాహన సేవతో స్వామి వారి వాహన సేవలు ముగియనున్నాయి.
ఇదీ చూడండి: