చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పురపాలక సంఘ పరిధిలోని 35 వార్డులకు రిజర్వేషన్లను ఖరారు చేస్తూ జిల్లా పాలనాధికారి హరినారాయణన్ నోటిఫికేషన్ విడుదల చేశారు. అన్ని పురపాలక సంఘాలకు సంబంధించి ఎన్నికలు నిర్వహించిన సందర్భంగా విలీన సమస్యలు న్యాయస్థాన పరిధిలో ఉండటంతో అప్పట్లో ఎన్నికలు జరపలేదు. ప్రస్తుతం ప్రభుత్వ విలీన నిర్ణయాన్ని ఆమోదిస్తూ గవర్నర్ రాజపత్రం విడుదల చేయడంతో ఎన్నికలకు రంగం సిద్ధం అవుతోంది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణం ప్రథమశ్రేణి పురపాలక సంఘంగా ఉన్నతి పొందింది. అందుకు తగ్గట్టుగా పట్టణానికి పరిసర ప్రాంతాల్లో ఉన్న పంచాయతీల విలీనంతో ప్రస్తుత ఎన్నికల నిర్వహణకు జనాభాతో పాటు ఓటర్లు పెరిగారు. పట్టణానికి సమీపంలోని తొట్టంబేడు, శ్రీకాళహస్తి మండలాల్లోని పలు గ్రామాలను విలీనం చేసుకున్నారు.
ఓటర్ల జాబితా సిద్ధం
జిల్లాలో శ్రీకాళహస్తి, కుప్పం మినహా అన్నీ పురపాలక సంఘాలకు ఎన్నికలు జరిగాయి. విలీన అభ్యంతరాలపై ఇక్కడ ఎన్నికలు వాయిదా వేశారు. ప్రస్తుతం అన్ని సమస్యలు వీడిపోవడంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు ఎన్నికలకు ఇక్కడి అధికారులు సమామత్తం అవుతున్నారు. అందులో భాగంగా ఇటీవల ఫొటో ఓటర్ల జాబితాలను ఓటర్లకు అందుబాటులోకి తీసుకువచ్చారు. సార్వత్రిక ఎన్నికలకు పట్టణ పరిధిలో 62,647 మంది ఓటర్లు కాగా విలీనంతో ప్రస్తుతం పట్టణ ఓటర్ల సంఖ్య 74,470కి చేరింది. ఇక తుది జాబితాల ప్రకారం 35,773 మంది పురుషులు, 38,687 మంది మహిళలు, ఇతరులు 10 మంది వెరసి ఓటర్ల సంఖ్య 74,470కి చేరుకుంది.
రిజర్వేషన్లు ఇలా..
ఎన్నికలకు సంబంధించి ఛైర్మన్ స్థానాన్ని ఇప్పటికే ఎస్టీ జనరల్‌కు కేటాయించారు. తాజాగా సోమవారం జిల్లా పాలనాధికారి హరినారాయణన్ వార్డుల రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఆ ప్రకారం పరిశీలిస్తే..
- ఎస్టీ విభాగంలో రెండు వార్డులు కేటాయించారు. మహిళ కోటా కింద 33వ వార్డుకు, ఎస్టీ జనరల్ స్థానాన్ని 26వ వార్డుకు కేటాయించారు.
- ఎస్సీ విభాగంలో అయిదు వార్డులు కేటాయించగా.. వీటిల్లో మహిళ కోటా కింద 1, 30 వార్డులు, ఎస్సీ జనరల్ కోటా కింద 4, 6, 19 వార్డులు ఉన్నాయి.
- బీసీ విభాగానికి సంబంధించి పది వార్డులు కేటాయించగా.. బీసీ మహిళా కోటా కింద 2, 7, 11, 20, 29 వార్డులు, బీసీ జనరల్ స్థానాలుగా 9, 10, 24, 27, 31 వార్డులు
- మహిళా విభాగంలో 13, 15, 21, 22, 23, 25, 28, 34, 35 తొమ్మిది వార్డులు రిజర్వ్ చేశారు.
- అన్ జనరల్ కోటా కింద 3, 5, 8, 12, 14, 16, 17, 18, 32 తొమ్మిది వార్డులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
కరోనా తగ్గాకే..
రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పట్లో ఇక్కడి పురపాలక సంఘానికి ఎన్నికలు జరిగే అవకాశం లేదని భావిస్తున్నారు. ప్రభుత్వం ఎప్పుడు ఆదేశించినా ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధమంటున్నారు. ఆశావహులు కూడా తమదైన ప్రయత్నాలు చేసుకోవడం గమనార్హం.
ఇదీ చదవండి..