గంజాయి.. మద్యం.. ఇసుక అక్రమంగా తరలించే వారిపై ఉక్కుపాదం మోపుతామని స్పెషల్ ఎన్‌ఫోర్‌మెంట్ బ్యూరో(ఎస్‌ఈబీ) డైరెక్టర్ ఆవుల రమేష్‌రెడ్డి హెచ్చరించారు. తిరుపతి అర్బన్, చిత్తూరు జిల్లాల ఎస్‌ఈబీ అధికారులు, సిబ్బందితో స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. మనుషులను వ్యసనాలకు దూరం చేయడం.. ఇసుక దోపిడీని నిలువరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌ఈబీని ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు అక్రమంగా దోపిడీ చేస్తున్న లక్ష మందిపై కేసులు నమోదు చేశామని.. 1.50 లక్షల కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు.
తిరుపతి అర్బన్, చిత్తూరు జిల్లాల్లో 66 సమస్యాత్మక గ్రామాలను గుర్తించామని రమేష్‌రెడ్డి చెప్పారు. అక్కడ అవగాహన కార్యక్రమాలు చేపట్టి సారా తయారీని నియంత్రించేందుకు చర్యలు చేపడతామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి 14 ప్రాంతాల మీదుగా అక్రమ మద్యం తరలి వచ్చే అవకాశం ఉన్నందున పటిష్ఠ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటికే జిల్లాలో పీడీ యాక్టు కింద నాలుగు కేసులు నమోదు చేసినట్లు గుర్తు చేశారు.
స్వచ్ఛంద సంస్థలు, వాలంటీర్ల సహకారంతో గ్రామీణ ప్రాంత ప్రజలు, విద్యార్థులకు అవగాహన కల్పించే కార్యక్రమాలకు రూపకల్పన చేస్తామని ప్రకటించారు. నూతన ఇసుక పాలసీ ద్వారా నిర్ణయించిన ధరకు ఇసుక అందేలా ఎస్‌ఈబీ కృషి చేస్తుందని చెప్పారు. వైజాగ్ నుంచి వివిధ జిల్లాలకు చేరుతున్న గంజాయి అక్రమ రవాణాపై దృష్టి సారించామన్నారు. గంజాయి మత్తు నుంచి యువతను సంరక్షించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. సమావేశంలో ఎస్‌ఈబీ ఎస్పీ రిషాంత్‌రెడ్డి, తిరుపతి అర్బన్, చిత్తూరు జిల్లాల ఎస్‌ఈబీ అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:
CM Jagan Review: 'ఫౌండేషనల్ స్కూళ్ల తర్వాత డిజిటల్ బోధనపై దృష్టి పెట్టాలి'